భాజపా మళ్ళీ అదే పాట!

December 27, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితిని నిష్పక్షపాతంగా బేరీజు వేస్తే, ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ కూడా వచ్చే ఎన్నికలలో తెరాసను డ్డీ కొనలేదని చెప్పక తప్పదు. మోత్కుపల్లి వంటి తెదేపా నేతలు ఈ చేదు నిజాన్ని గ్రహించారు కనుకనే తెరాస, భాజపా, తెదేపాలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే బాగుంటుందని చెపుతున్నారు. కానీ బలహీనపడిన తెదేపా, బలం లేని భాజపాలతో చేతులు కలుపవలసిన అవసరం తెరాసకు లేదు. అది వేరే సంగతి.  రాష్ట్ర భాజపా నేతలు మాత్రం వాస్తవ పరిస్థితిని ఇంకా అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. అందుకే రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఇంకా పాడిందే పాట అన్నట్లుగా వచ్చే ఎన్నికలలో తాము ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తామని అంటున్నారు. 

అయన నిన్న హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “2019ఎన్నికలలో మేము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేసి తెలంగాణాలో అధికారంలోకి వస్తాము. మాకా నమ్మకం ఉంది. ఎందుకంటే తెరాస సర్కార్ ఎన్నికల హామీలను అమలుచేయడంలో విఫలమైనందుకు రాష్ట్ర ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. వారు మూడేళ్ళపాటు చాలా ఓపికగా ఎదురుచూశారు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఉత్తరాది రాష్ట్రాలలో ప్రజలు పదేపదే తిరస్కరించడం అందరూ చూస్తూనే ఉన్నారు. పైగా రాష్ట్ర ప్రజలు ఇదివరకే కాంగ్రెస్ పాలనను రుచి చూశారు. అది రాష్ట్రానికి చేసింది...చేయగలిగింది ఏమీ లేదని ఎప్పుడో తేలిపోయింది. కనుక ఆ రెండు పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయంగా నిలిచిన భాజపాకే రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారనే నమ్ముతున్నాను,” అని లక్ష్మణ్ అన్నారు. 

ఇటువంటి మాటలు మీడియాకు చెప్పుకోవడానికి, కాలక్షేపానికి పనికివస్తాయేమో గానీ ఎన్నికలలో పనికిరావని బహుశః లక్ష్మణ్ కు కూడా తెలిసే ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో రాజకీయాలను భాజపాకు అనుకూలంగా మలుపు తిప్పడం సాధ్యం కాదు కనుక ఇటువంటి పాత పాటలు పాడుకొంటూ రోజులు దొర్లించక తప్పదు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాలేకపోయినా కనీసం గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకోగలిగితే అదే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. 


Related Post