ఆర్టీసితో మెట్రో పోటీ పడగలదా?

December 06, 2017
img

మెట్రో రైల్ సర్వీసులకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తోంది. రోజురోజుకు మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోంది. అలాగని ఆర్టీసీ బస్సులు, క్యాబ్ లు, ఆటోలలో రద్దీ ఏమాత్రం తగ్గలేదు. అలాగే రోడ్లపై తిరిగే ప్రైవేట్ వాహనాలు తగ్గలేదు కనుక ట్రాఫిక్ కూడా తగ్గలేదు. వేటి సౌలభ్యం వాటికుంది గనుక అటు మెట్రో రైల్ సర్వీసులు, ఎంఎంటిఎస్ సర్వీసులు, నగరంలో వాహనాలు, రోడ్లు అన్నీ కూడా యధాప్రకారం కిక్కిరిసే ఉంటున్నాయి. 

అయితే నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలకు మెట్రో టికెట్ ధరలు భరించడం కష్టమేనని చెప్పవచ్చు. కనుక ఆటో లేదా బస్సు టికెట్లు పెట్టుకొని మెట్రో స్టేషన్ చేరుకొనే బదులు, కాస్త సమయం ఎక్కువ పడుతున్నా మెట్రో టికెట్ ధరలో సగం లేదా అంతకంటే తక్కువకే తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కనుకనే యధాప్రకారం రోడ్లపై ఆర్టీసి బస్సులు, ప్రైవేట్ వాహనాలు కిక్కిరిసి తిరుగుతున్నాయని చెప్పవచ్చు. 

ప్రస్తుతం నగరవాసులందరూ మెట్రో మోజుతో తిరుగుతున్నప్పటికీ, టికెట్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నందున సామాన్య ప్రజలు ఆర్టీసి బస్సులకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ఇది నిరూపిస్తోంది. కనుక మెట్రో రైల్ సర్వీసు వలన ఆర్టీసికి నష్టమేమీ లేదు కానీ ఆర్టీసి వలనే మెట్రోకు సవాలు ఎదురుకావచ్చు. కనుక మెట్రో సేవలు సామాన్యులకు కూడా అందుబాటు ధరలలో ఉండేలా చూడటం చాలా అవసరం. అయితే మున్ముందు అన్ని మెట్రో స్టేషన్లకు ఆర్టీసి ఫీడర్ సర్వీసులను పెంచినట్లయితే, అటు ఆర్టీసి, ఇటు మెట్రో రెండింటి ఆదాయం కూడా ఇంకా పెరుగవచ్చు. హైదరాబాద్ లో నానాటికీ జనాభా పెరుగుతూనే ఉంది కనుక, ఎన్ని ఆర్టీసి బస్సులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు తిరుగుతున్నా మెట్రో రైల్ సర్వీసులు కూడా లాభసాటిగానే నడువవచ్చు. 

Related Post