ట్రబుల్స్ లో మెట్రో ట్రబుల్స్ వేరయా..

December 02, 2017
img

మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభం అయిన రోజున దానికోసం ఏళ్ళ తరబడి కన్నులు కాయలు కాసేలా ఎదురుచూసిన హైదరాబాద్ వాసులు దాదాపు పండగ చేసుకొన్నారు. మొదటిరోజున మెట్రో ప్రయాణపు అనుభూతిని చాలామంది ఎంజాయ్ చేశారు. కానీ ఊహించినట్లుగానే ఇప్పుడు చాలామంది మెట్రో సమస్యలు ఏకరువు పెడుతున్నారు. 

మెట్రో ప్రయాణికులు ప్రధానంగా చెపుతున్నవి మూడు సమస్యలు. 1. మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించకపోవడం. 2. త్రాగునీరు. టాయిలెట్ల సౌకర్యం లేకపోవడం. 3. ప్రతీ దానికి జరిమానాలు విధించడం. 

మెట్రో సర్వీసుల ప్రారంభిస్తున్నప్పుడు ఇటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు, అసౌకర్యాలు ఎదురయ్యే అవకాశం ఉందని, కనుక కొన్ని రోజులు ప్రజలు ఓపిక పట్టాలని మంత్రి కేటిఆర్ ముందే విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పాటయిన ఏ వ్యవస్థలోనైనా మొదట్లో కొన్ని లోటుపాట్లు, అసౌకర్యాలు ఎదురవడం సహజమే కనుక మంత్రి కేటిఆర్ చెప్పినది సమంజసమే. అయితే మెట్రోలో రోజూ ప్రయాణించాలనుకొనేవారికి ఈ సమస్యలు చాలా ఇబ్బందికరమేనని చెప్పక తప్పదు. కానీ కెటిఆర్ చెప్పినట్లు ప్రయాణికులు కూడా కొంత ఓపిక పట్టక తప్పదు.

మెట్రో స్టేషన్లవద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించకపోవడం చేత మెట్రో ప్రయాణికుల వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్టేషన్ కు తరలించి కేసులు నమోదు చేస్తున్నారు. వాటిని విడిపించుకోవడానికి వాహన యజమానులు జరిమానాలు చెల్లించవలసి వస్తోంది. మెట్రో టికెట్ గరిష్టంగా రూ.60 అయితే, ట్రాఫిక్ పోలీస్ చలానా కనీసం రూ.100 ఉంటుంది.   ఇదెలా ఉందంటే ‘చారణా కోడికి బారాణా మసాలా’ అన్నట్లుంది. 

ఇక వృద్ధులు, పిల్లలు, మహిళలకు అవసరమైన చోట త్రాగునీరు, టాయిలెట్ సౌకర్యం కల్పించడం చాలా అవసరమే. అయితే గరిష్టంగా 25 నిమిషాలలో మెట్రో ప్రయాణం ముగుస్తుంది కనుక మెట్రో రైల్లో టాయిలెట్ కల్పించమని ఎవరూ అడగలేరు కానీ పెయిడ్ ఏరియాలలో అటువంటి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. హైదరాబాద్ లో వేసవి ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో అందరికీ తెలుసు. కనుక ఎక్కడికక్కడ త్రాగునీటి సౌకర్యం కల్పించడం తప్పనిసరి. లేదా ప్రయాణికులను నీళ్ళ బాటిల్స్ వగైరాలు తీసుకు వెళ్లేందుకు అనుమతించి మెట్రో రైల్లో కూడా డస్ట్ బీన్స్ ఏర్పాటు చేయక తప్పదు. 

మెట్రో స్టేషన్ చేరుకోవడానికి అనేకమంది వారివారి నివాస ప్రాంతాల నుంచి ఆటోలు, బస్సులలో కూడా వస్తుంటారు. లేదా స్వంత వాహనాలపై వస్తుంటారు. బయట ఆటోలకు, బస్సులకు లేదా పార్కింగ్ ఛార్జీలు చెల్లించుకొని, ట్రాఫిక్ చలనాలు కూడా కట్టుకొని, మెట్రో టికెట్ కొనుకొని ప్రయాణిస్తున్నవారిపై జరిమానాలు కూడా విధిస్తే, వారికి మెట్రో ప్రయాణం భారంగా కనిపిస్తుంది. కనుక మెట్రో లో జరిమానాలు కూడా సహేతుకంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. 

హైదరాబాద్ మెట్రోను చాలా అద్భుతంగా నిర్మించి ఉండవచ్చు. ఈ మెట్రో రైల్ హైదరాబాద్ లో నడుస్తోంది తప్ప అన్నివిధాలుగా అమెరికాలో ఉన్నది కాదు. కనుక హైదరాబాద్ నగర ప్రజల ఆర్ధిక పరిస్థితులు, వారి అలవాట్లు, వారి అవసరాలు వంటివన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయడం చాలా అవసరం. 

చివరిగా చెప్పవలసింది ఏమిటంటే, డిల్లీ, చెన్నై తదితర నగరాలలో మెట్రో ప్రయాణాలకు ఇప్పుడు ప్రజలు బాగా అలవాటు పడ్డారు. కనుక హైదరాబాద్ వాసులు కూడా మెట్రోకు అలవాటుపడటానికి కాస్త సమయం పట్టవచ్చు. కనుక ఈలోగా హైదరాబాద్ వాసులు మెట్రో ప్రయాణానికి ఎక్కువగా మొగ్గు చూపేవిధంగా మెట్రో వ్యవస్థలో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకొంటే మంచిది. మెట్రో రైల్ ప్రయాణం కేవలం సరదాగా టైం పాస్ చేయడానికేనని హైదరాబాద్ వాసులు భావిస్తే నష్టపోయేది మెట్రో సంస్థే. కనుక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేయడం మంచిది. 

Related Post