మెట్రో ట్రబుల్స్ కూడా షురూ..

November 30, 2017
img

హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించకపోవడం వలన బైక్స్, స్కూటర్స్, కార్లపై వచ్చినవారు వాటిని ఎక్కడ పార్క్ చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా పార్కింగ్ సదుపాయం కల్పించకపోవడంతో కొందరు తమ బైక్స్ ను స్టేషన్ ఆవరణలోనే ఉంచి వెళుతున్నారు. ఆవిధంగా అమీర్ పేట్ స్టేషన్ ఆవరణలో పార్క్ చేసి ఉన్న వాహనాలను ఈరోజు ఉదయం ట్రాఫిక్ పోలీసులు వచ్చి స్టేషన్ కు తరలించుకుపోయారు. ఈ సంగతి తెలిసి వాహనదారులు లబోదిబోమంటున్నారు. పార్కింగ్ సదుపాయం కల్పించనప్పుడు తమ వాహనాలను ఎక్కడ పెట్టుకోవాలని మెట్రో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక అర్జెంటుగా అన్ని మెట్రో స్టేషన్లవద్ద పార్కింగ్ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే వాహనాలున్నవారు మెట్రో రైళ్ళలో ప్రయాణించడానికి ఇష్టపడకపోవచ్చు అప్పుడు ఆ మేరకు మెట్రో నష్టపోయే ప్రమాదం ఉంది. 

ఇక మెట్రో టికెట్ ఛార్జీలు కాస్త ఎక్కువగానే ఉన్నాయనేది ఎక్కువగా వినిపిస్తున్న మరో పిర్యాదు. కనుక స్టేషన్ ఆవరణలో వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నపుడు పార్కింగ్ ఛార్జీలు నామమాత్రంగా ఉంచడం చాలా అవసరం లేకుంటే పార్కింగ్ ఛార్జ్+మెట్రో టికెట్ ఛార్జ్ లతో ప్రయాణికుల జేబులు చిల్లులు పడితే వాహనదారులు మెట్రో ప్రయాణాలకు ఆసక్తి చూపకపోవచ్చు. 

ఇక స్మార్ట్ కార్డ్ కు సంబంధించి ఒక కొత్త సమస్య నిన్న బయటపడింది. ఒక ప్రయాణికుడు రూ.200 పెట్టి స్మార్ట్ కార్డ్ కొనుకొన్నాక, స్టేషన్ లోపలకు ప్రవేశించి తాపీగా స్టేషన్ అంతా గంటసేపు కలియతిరిగి అన్నీ చూసి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ కార్డును స్వైప్ చేస్తే దానిలో కేవలం రూ.12 మాత్రమే బ్యాలెన్స్ మిగిలినట్లు చూపింది. కార్డును ఒకసారి స్వైప్ చేసి లోపలకు ప్రవేశించినప్పటి నుంచి, ట్రైన్ ఎక్కినా ఎక్కకపోయినా అంతసేపు ప్రయాణం చేస్తున్నట్లే పరిగణించి, అంతసేపటిలో ఎంత దూరం ప్రయాణించవచ్చో లెక్క కట్టి దానికి స్మార్ట్ కార్డు నుంచి ఛార్జీలు కట్ అయిపోతాయన్న మాట. కనుక స్మార్ట్ కార్డ్ ఉందని ట్రైన్ ఎక్కకుండా స్టేషన్ లోపల ఎక్కువసేపు కాలక్షేపం చేసినా నష్టమేనన్న మాట! బహుశః ఈవిధానం టికెట్స్, టోకెన్ కొనుగోలు చేసినవారికీ వర్తింపజేయవచ్చు కనుక సాధారణ రైల్వే స్టేషన్ లో మాదిరిగా గంటలు గంటలు కాలక్షేపం చేస్తే జేబులు ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంటుందని మెట్రో ప్రయాణికులు అందరూ గ్రహించాలి. 

Related Post