ఎస్.బి.ఐ. ఖాతాదారులకు శుభవార్త

September 25, 2017
img

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు ఒక శుభవార్త. సేవింగ్స్ ఖాతాలలో కనీసం నిలువ ఉంచవలసిన రూ.5,000 లను రూ.3,000 కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెన్షనర్లు, మైనర్లను ఈ కనీసపు బ్యాలెన్స్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలియజేసింది. 

మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు ఎస్.బి.ఐ. సవరించిన మినిమం బ్యాలెన్స్ ఇక నుంచి ఈవిధంగా ఉంటుంది. 

ఇప్పటివరకు మెట్రో నగరాలలో రూ.5,000 ఉండగా దానిని రూ.3,000కు తగ్గించింది. పట్టణాలలో రూ.3,000 బ్యాలెన్స్ ను మార్చలేదు. కనుక మెట్రో నగరాలు, పట్టణాలలో మినిమం బ్యాలెన్స్ సమానంగా అంటే రూ.3,000 ఉంచవలసి ఉంటుంది. 

అలాగే చిన్న పట్టణాలలో రూ.2,000, గ్రామాలలో రూ.1,000 గా ఉన్న మినిమం బ్యాలెన్స్ ను మార్చలేదు. అవి యధాప్రకారం కొనసాగుతాయి. 

సవరించిన ఈ మినిమం బ్యాలెన్స్ తమ ఖాతాలలో ఉంచని వారిపై మెట్రో, అర్బన్ ప్రాంతాలలో రూ.30-50 వరకు సర్వీస్ చార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. అదేవిధంగా చిన్న పట్టణాలలో గ్రామీణ ప్రాంతాలలో వారి నుంచి రూ.20-40 సర్వీస్ చార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ చార్జీలు వర్తిస్తాయని తెలిపింది.

విజయ్ మాల్యా వంటి బడాబాబులకు ఉదారంగా వేలకోట్ల రుణాలు పంచిపెట్టేసి వాటిని తిరిగి రాబట్టుకోలేక నష్టపోతున్న ఎస్.బి.ఐ. మరియు ఇతర బ్యాంకులు ఆ భారాన్ని తమ సేవింగ్స్ బాంక్ ఖాతాదారులపై ఈవిధంగా మోపుతున్నాయి. బ్యాంకులు తమ స్వీయ తప్పిదాల కారణంగా ఏర్పడిన నష్టాలను ఏవిధంగా పూడ్చుకోవాలనే ఆలోచించాయి తప్ప నెలకు రూ.10-15,000 సంపాదించుకొనే ఒక మధ్యతరగతి ఖాతాదారుడు తన ఖాతాలో రూ.5,000 మినిమం బ్యాలెన్స్ ఏవిధంగా ఉంచగలడని ఏ బ్యాంకూ ఆలోచించలేదు. దీనినే మానవతా దృక్పధం లేని వ్యాపారం అనకతప్పదు. సేవింగ్స్ ఖాతాదారులలో అత్యధికులు మధ్యతరగతి దిగువ మధ్యతరగతివారే ఉంటారు. ఒకప్పుడు అటువంటి మధ్యతరగతి, నిరుపేద ప్రజల ఆర్ధికపరిస్థితులను దృష్టిలో పెట్టుకొనో లేక ఇతర బ్యాంకుల నుంచి వచ్చే పోటీని తట్టుకోవడానికో ఎస్.బి.ఐ.తో సహా చాలా బ్యాంకులు జీరో బ్యాలెన్స్ తో ఖాతాలు నిర్వహించుకోనిచ్చి ప్రజాధారణ పొందాయి. తరువాత మెల్లగా రూ.500 మినిమం బ్యాలెన్స్ చేశాయి. కొన్ని నెలల క్రితం దానిని ఏకంగా రూ.5,000 కు పెంచేసింది. కానీ రూ.5,000 మినిమం బ్యాలెన్స్ షరతుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో దానిని రూ.3,000 కు తగ్గించింది. దానినే మహాభాగ్యం అనుకొని సంతోషపడవలసి వస్తోంది. 

Related Post