జియోతో పోటీకి వొడా ఫోన్ సై!

July 25, 2017
img

ఎప్పటికప్పుడు జియో విసురుతున్న ఊహించని సవాళ్ళను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇతర టెలికాం సంస్థలు జియోను ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకొంటున్నాయి. ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న అవి కూడా జియో ప్రకటిస్తున్న ప్లాన్స్ కు కాస్త అటు ఇటుగా ప్లాన్స్ రూపొందించుకొని ప్రకటిస్తున్నాయి. 

ధన్ ధనాధన్ ఆఫర్ ముగియడంతో జియో కూడా తప్పకుండా ధరలు పెంచుతుందని, అప్పుడు దాని మార్కెట్ తగ్గితే తాము మళ్ళీ పుంజుకోవచ్చని ఆశగా ఎదురుచూస్తున్న ఇతర నెట్ వర్క్ ఆపరేటర్లకు జియో మళ్ళీ పెద్ద షాక్ ఇచ్చింది. ఈసారి కూడా మళ్ళీ సామాన్య ప్రజలకు అందుబాటు ధరలలో రూ.149, 303,399 విలువ చేసే మూడు ఆకర్షణీయమైన ప్లాన్స్ ప్రకటించింది. వాటిలో వరుసగా 28,56,84 రోజులు కళా వ్యవధిగల అపరిమిత కాల్స్ మరియు పరిమిత డేటా సౌకర్యం  కల్పించింది. 

జియో విసిరిన ఈ కొత్త సవాలును తట్టుకోవడానికి వొడా ఫోన్ కూడా ఇంచుమించు అటువంటి ప్లానే ఒకటి ఈరోజు ప్రకటించింది. దానిలో కొత్త వినియోగదారులకు మాత్రమే రూ.144 ఆ పై ప్లాన్స్ లో అపరిమిత కాల్స్, వొడా నెట్ వర్క్ లో ఫ్రీ రోమింగ్, రోజుకు 50 ఎంబి డేటా అందిస్తోంది. అదే రూ.244 ప్లాన్లో అపరిమిత కాల్స్, 70 జిబి, 4జి డేటా, అపరిమిత కాల్స్ సౌకర్యం కల్పించింది. 70 రోజుల కాలవ్యవది గల ఈ ప్లాన్ లో రోజుకు 1జిబి డేటా వాడుకోవచ్చు. ఆపైన 128 కేబి.పి.ఎస్. వేగం మాత్రమే లభిస్తుంది. ఇదే ప్లాన్ మళ్ళీ రెండవసారి రీచార్జ్ చేసుకొన్నప్పుడు 35 రోజులు మాత్రమే వర్తిస్తుంది.

అయితే ఈ ప్లాన్స్ తో జియోను తట్టుకొని నిలబడటం సాధ్యమేనా అని వొడా ఫోన్ సంస్థ ఆలోచించుకోవడం మంచిది. ఎందుకంటే త్వరలోనే జియో ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి విడుదల కాబోతోంది. దానిలో కేవలం రూ.143 కే అపరిమిత కాల్స్, డేటా వంటివన్నీ అందించబోతోంది. ఒకసారి అది మార్కెట్లోకి వస్తే, దానివైపు తమ వినియోగదారులు వెళ్ళిపోకుండా కాపాడుకోవడానికి, అదిచ్చే పోటీని తట్టుకోవడానికి ఏమి చేయాలో ఇప్పటి నుంచే ఆలోచించుకొంటే మంచిదేమో!

Related Post