హైదరాబాద్‌లో మరో భారీ ఐ‌టి సెజ్ ఏర్పాటు

January 18, 2021
img

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 3-4 ఐ‌టి సెజ్ ఏర్పాటయ్యాయి. రాయదుర్గం వద్ద కొత్తగా మరో ఐ‌టి సెజ్ ఏర్పాటుకాబోతోంది. సస్టెయిన్ ప్రాపర్టీస్ అనే సంస్థ రూ.823 కోట్లు వ్యయంతో 3.6 ఎకరాలలో దీనిని ఏర్పాటుచేయబోతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల అనుమతుల మండలి కూడా ఆమోదం తెలిపింది. ఈ ఐ‌టి సెజ్‌లో ఏర్పాటుకాబోయే ఐ‌టి కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా 17,500 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని, పరోక్షంగా కనీసం 2-3,000 మందికి ఉపాధి లభిస్తుందని సస్టెయిన్ ప్రాపర్టీస్ సంస్థ యాజమాన్యం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు హామీ ఇచ్చింది. 

ఇదివరకు ఐ‌టి కంపెనీలు కేవలం హైదరాబాద్‌కే పరిమితమయ్యేవి. వాటి కారణంగా హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇతర రాష్ట్రాల నుండి, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ వస్తున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో నగరంపై ఒత్తిడి పెరిగిపోతోంది. వాహనాలు, ట్రాఫిక్, కాలుష్యం, త్రాగునీరు, వసతి వంటి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకే కేటీఆర్‌ ఐ‌టిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ తదితర జిల్లాలలో కూడా ఐ‌టి కంపెనీలు ఏర్పాటుచేయిస్తూ ఎక్కడికక్కడ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. హైదరాబాద్‌ నగరానికి సమీపంలోనే మేడ్చల్-మల్కాజగిరి జిల్లాలో ఇప్పుడు ఈ భారీ ఐ‌టి సెజ్ ఏర్పాటు కాబోతుండటం చాలా సంతోషకరమైన విషయమే. 

Related Post