తెలంగాణకు రూ.700 కోట్లు పెట్టుబడులు

October 28, 2020
img

తెలంగాణ రాష్ట్రంలో గ్రాన్యూల్స్ ఇండియా రూ.400 కోట్లు, లారస్ ల్యాబ్స్ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఈ విషయం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ నిన్న మీడియాకు తెలియజేశారు. ఆ రెండు సంస్థల అధినేతలతో మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటి స్థాపనకు పూర్తి సహాయసహకారాలు  అందజేస్తుందని మంత్రి కేటీఆర్‌ వారికి హామీ ఇచ్చారు. ఆ రెండు సంస్థల ద్వారా ప్రత్యక్షంగా 1,750 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా వందలాదిమందికి ఉపాది అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. జీనోమ్ వ్యాలీలో ఐకేపీ నాలెడ్జి పార్కులో ఈ రెండు పరిశ్రమలను ఏర్పాటు కాబోతున్నాయి.   

గ్రాన్యూల్స్ ఇండియా 1984 నుంచే హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోంది. దానికి నగర శివార్లలో గాగిల్లాపూర్‌లో అతిపెద్ద ఫార్ములేషన్ ఇంటర్మీడియెట్ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఆ సంస్థకు హైదరాబాద్‌లో ఒకటి, పూణేలో ఒకటి పరిశోధనా కేంద్రాలున్నాయి. హైదరాబాద్‌తో సహా భారత్‌లో 6, చైనాలో ఒక ఉత్పత్తి కేంద్రాలున్నాయి. వాటన్నిటి ద్వారా సంస్థ వార్షిక టర్నోవర్ రూ.2,336 కోట్లు సాధిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మరో ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించేందుకు సిద్దమవుతోంది. ఈ సంస్థకు సీ.కృష్ణప్రసాద్ సీఎండీగా వ్యవహరిస్తున్నారు.    

లారస్ ల్యాబ్స్ కూడా 2005 నుంచి హైదరాబాద్‌ కేంద్రంగానే పనిచేస్తోంది. దీనికి హైదరాబాద్‌తో సహా దేశంలో 5 ప్లాంట్లు, ఒక పరిశోధనా కేంద్రం ఉన్నాయి. దీని వార్షిక టర్నోవర్ రూ.2,803 కోట్లు. ఈ సంస్థను సత్యనారాయణ చావా స్థాపించి నడిపిస్తున్నారు. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయబోయే పరిశ్రమలో 5 బిలియన్ డోసులను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం కలిగి ఉంటుందని ఆయన తెలిపారు.

Related Post