మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా...అయితే ఇది మీకోసమే

September 16, 2020
img

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల ఏటిఎం లావాదేవీలకు మరింత భద్రత కల్పించేందుకుగాను కొన్ని రోజుల క్రితం కొత్తగా ఓటిపి విధానాన్ని ప్రవేశపెట్టింది. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల మద్య ఏటిఎంల నుంచి రూ.10,000 అంతకు మించి డబ్బు తీసుకోవాలనుకొంటే వారి రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌కి బ్యాంక్ నుంచి ఓ ఓటిపి నెంబరు వస్తుంది. ఏటిఎంలో దానిని ఎంట్రీ చేసిన తరువాతే డబ్బు బయటకు వస్తుంది. 

రాత్రి సమయాలలో వేరెవరైనా వినియోగదారుల కార్డును ఉపయోగించి ఏటిఎంల నుంచి డబ్బు తీసుకోకుండా అడ్డు కొనేందుకు ఇది చాలా ఉపయోగపడుతోంది. ఒకవేళ ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే వెంటనే వినియోగదారులకు కూడా తెలిసిపోతుంది కనుక వెంటనే కార్డును బ్లాక్ చేసి తమ ఖాతా నుంచి డబ్బు డ్రా చేయనీయకుండా అడ్డుకోగలుగుతారు. 

ఈ ప్రయోగం విజయవంతం అవడమే కాకుండా వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక నుంచి 24 గంటలు ఈ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. కనుక ఇకపై స్టేట్ బ్యాంక్ వినియోగదారులు ఏటీఎం నుంచి డబ్బు తీసుకొనేందుకు వెళ్ళేటప్పుడు మీ మొబైల్ ఫోన్‌ కూడా వెంట తీసుకువెళ్ళడం మరిచిపోవద్దు. 

స్టేట్ బ్యాంక్ తన వినియోగదారులకు ఏటీఎం కార్డు లేకుండా కూడా డబ్బు డ్రా చేసుకొనేందుకు సదుపాయం కల్పించింది. దాని కోసం ముందుగా స్టేట్ బ్యాంక్‌కు చెందిన ‘యోనో’ మొబైల్ యాప్‌ను మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్లో  డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తరువాత దానిలో మీ వివరాలను నమోదు చేసుకొని బ్యాంక్ వద్దకు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. యోనో యాప్ యాక్టివేట్ చేసుకొన్న తరువాత దానిలో ‘యోనో క్యాష్’ అనే ఆప్షన్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు.

Related Post