వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే వ్యాక్సిన్‌ అందిస్తాం

August 04, 2020
img

ఇవాళ్ళ హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ కంపెనీలో కరోనా వ్యాక్సిన్‌ గురించి చర్చా సమావేశం జరిగింది. దానిలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా, మహిమా దాట్లతో కరోనా నివారణకు ఆ సంస్థ తయారుచేస్తున్న కోవాక్సిన్ గురించి పలు విషయాలు అడిగి తెలుసుకొన్నారు. 

కేటీఆర్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఆ సంస్థ ఎండీ కృష్ణా ఎల్లా సమాధానమిస్తూ, “ కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ చాలా జోరుగా సాగుతున్నాయి. మా సంస్థ తయారుచేసిన కోవాక్సిన్ టీకా ప్రపంచంలో ఏ ఇతర సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్‌కు తీసిపోదు. భారత్‌లో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండేవిధంగా వ్యాక్సిన్‌ ధరను నిర్ణయిస్తాము. బహుశః అది ఒక వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే లభించవచ్చు. క్లినికల్ ట్రయల్స్‌ పూర్తయితే భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయడానికి సిద్దంగా ఉన్నాము,” అని చెప్పారు. 

ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల మాట్లాడుతూ, “మా సంస్థకు నెలకు 8 నుంచి 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు తయారుచేయగల సామర్ధ్యం ఉంది. అంత భారీ స్థాయిలో ఉత్పత్తి చేసినా వ్యాక్సిన్‌ తయారీ, నాణ్యతాలో ఏమాత్రం రాజీపడబోము. ప్రపంచస్థాయి ప్రమాణాలకు తీసిపోనివిధంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సరఫరా చేస్తాము,” అని అన్నారు. 

Related Post