త్వరలో అమెజాన్‌కు టీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలు?

July 22, 2020
img

టీఎస్‌ఆర్టీసీ గురించి చెప్పుకోవలసివస్తే రెండు విషయాలు తప్పక చెప్పుకోవాలి. 1. అత్యంత ప్రజాధారణ కలిగిన సంస్థ. 2. ఎప్పుడూ నష్టాలలోనే సాగిపోయే సంస్థ. పల్లెలు, పట్టణాలు,నగరాలలో ఎక్కడ చూసినా కనబడే ఆర్టీసీ బస్సులు సామాన్యప్రజలకు అందుబాటులో ఉంటాయి కనుక వాటికి మంచి ఆదరణ ఉంది. కర్ణుడి చావుకు వేయి శాపాలు... వేయి కారణాలన్నట్లు అత్యంత ప్రజాధారణ ఉన్న టీఎస్‌ఆర్టీసీ నష్టాలకు కూడా అన్నే కారణాలున్నాయి. అవన్నీ ప్రజలందరికీ తెలిసినవే. కనుక టీఎస్‌ఆర్టీసీని మళ్ళీ లాభాల బాట పట్టించడానికి సిఎం కేసీఆర్‌, దానిలో కొత్తగా కార్గో అండ్ పార్శిల్ సర్వీసులను ప్రారంభింపజేశారు. లాభదాయకతలేని కొన్ని రూట్లలో బస్సులను నిలిపివేసి ఆ బస్సులనే కార్గో బస్సులుగా మార్పు చేయించి నడిపింపజేస్తున్నారు. ఆ ఆలోచన... ప్రయోగం ఫలించి కార్గో సర్వీసుల ద్వారా టీఎస్‌ఆర్టీసీకి మంచి ఆదాయం లభిస్తోంది.

ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, అవసరమైన సరుకుల రవాణా, అలాగే గోదాముల నుంచి రేషన్ డిపోలకు నిత్యావసర సరుకులు, రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్‌కు బల్లలు, మంచాలు, దుప్పట్లు రేషన్ సరుకులు వగైరాలను రవాణా చేస్తూ మంచి ఆదాయం గడిస్తోంది. 

ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకే పరిమితమైన టీఎస్‌ఆర్టీసీ ఇప్పుడు ప్రైవేట్ సంస్థల నుంచి కూడా సరుకు రవాణాకు ఆర్డర్లు సంపాదించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. వాటిలో భాగంగానే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కంపెనీతో సరుకు రవాణాకు ఒప్పందం చేసుకొనేందుకు టీఎస్‌ఆర్టీసీ అధికారులు చర్చిస్తున్నారు. ఒకవేళ అది ఖరారు అయితే హైదరాబాద్‌లో అమెజాన్ కేంద్రం నుంచి రాష్ట్రంలో వివిద ప్రాంతాలకు, అలాగే ఇరుగుపొరుగు రాష్ట్రాలలో వివిద ప్రాంతాలకు టీఎస్‌ఆర్టీసీ వస్తువులను చేరవేస్తుంది. టీఎస్‌ఆర్టీసీలో కార్గోతో పాటు పార్సిల్ సర్వీసులు కూడా ఉన్నందున చిన్న చిన్న వస్తువులను కూడా రవాణా చేయగలుగుతుంది కనుక ఈ ఒప్పందం కుదిరితే లాభాలను ఆర్జించగలదు. 

Related Post