ప్రైవేట్ పరీక్షలకు మళ్ళీ బ్రేక్

July 02, 2020
img

తెలంగాణలో ఐసీఎంఆర్ అనుమతించిన 18 ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆసుపత్రులలో నేటి నుంచి కరోనా పరీక్షలు నిలిపివేశాయి. వాటిపై ప్రజల నుంచి పలు పిర్యాదులు రావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన నాలుగు బృందాలు తనికీలు చేసి అనేక లోపాలను గుర్తించాయి. 

ముఖ్యంగా రక్షణ దుస్తులు ధరించకుండా సిబ్బంది కరోనా పరీక్షలు చేస్తుండటం, ప్రయోగశాలలలో సరైన పరికరాలు, సౌకర్యాలు లేకపోవడం, సిబ్బందికి పరీక్షల గురించి సరైన అవగాహన లేకపోవడం, రోగులకు సంబందించి రికార్డులు మెయింటెయిన్ చేయకపోవడం, హడావుడిగా పరీక్షలు చేసి ‘మమ’ అనిపించేస్తుండటం వంటి అనేకలోపాలను అధికారులు గుర్తించారు. తద్వారా కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని భావించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు తెలియజేయడంతో రెండు రోజులు పరీక్షలు నిలిపివేయించారు. 

ప్రైవేట్ పరీక్షల తీరును మరింత మెరుగుపరుచుకోవాలనే అధికారుల పదేపదే హెచ్చరికలతో నేటి నుంచి ఈనెల 5వరకు ప్రైవేట్ పరీక్షలు నిలిపివేసి అధికారుల సూచనల మేరకు లోపాలను సవరించుకొని, ఈ మూడు రోజులలో సిబ్బందికి కరోనా పరీక్షలకు సంబందించి శిక్షణ కూడా ఇవ్వాలని నిర్ణయించుకొన్నట్లు తెలిపాయి. మళ్ళీ ఈ నెల 6వ తేదీ నుంచి మళ్ళీ కరోనా పరీక్షలు చేస్తామని ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆసుపత్రుల యాజమాన్యాలు తెలిపాయి.

Related Post