కరోనా భయంతో షాపూర్‌నగర్‌లో దుకాణాలు బంద్‌!

June 27, 2020
img

కరోనా గురించి ప్రభుత్వం ఏమి చెపుతున్నప్పటికీ హైదరాబాద్‌ నగరంలో కరోనా భయంతో దుకాణాలు బంద్‌ చేసుకోవడం గమనిస్తే పరిస్థితి తీవ్రత అర్ధం అవుతుంది. కరోనా భయంతో మొన్న గురువారం నుంచి సికింద్రాబాద్‌లోని అన్ని వస్త్ర దుకాణాలు బంద్‌ కాగా, ఇప్పుడు కుత్బుల్లాపూర్‌ పరిధిలోని షాపూర్‌నగర్‌లో గల అన్ని దుకాణాలను ఆదివారం నుంచి జూలై 5వరకు మూసివేయాలని నిర్ణయించిన్నట్లు మార్కెట్ కమిటీ ప్రకటించింది. షాపూర్‌నగర్‌ ప్రధానమార్కెట్ కావడంతో వివిద ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిమంది వస్తుంటారని కనుక ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నప్పటికీ కరోనా వ్యాపించే అవకాశం ఉంటుందని మార్కెట్ కమిటీ ప్రతినిధి తెలిపారు. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యగా ఒక వారం రోజులు మార్కెట్ మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి రెండున్నర నెలలు కొనసాగించింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు, ప్రజల జీవనోపాధి దెబ్బతింటున్నాయని, ప్రభుత్వాలు కూడా ఆదాయం కోల్పోతున్నాయనే  ఆలోచనతో కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించింది. కానీ మళ్ళీ ఇప్పుడు కరోనా భయంతో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసుకొని లాక్‌డౌన్‌ పాటిస్తుండటం గమనిస్తే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇంకా ఎప్పుడు?అనే సందేహాలు కలుగకమానవు. అయితే ముందే చెప్పుకొన్నట్లు ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం  కరోనా వ్యాక్సిన్ ఒక్కటే. అది అందరికీ అందుబాటులోకి వస్తే తప్ప పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోవడం  కష్టమే. అప్పటి వరకు అందరికీ ఈ కష్టాలు.. ప్రాణభయం తప్పదు.

Related Post