నేటి నుంచి దేశీయ విమానసేవలు షురూ

May 25, 2020
img

నేటి నుంచి దేశీయ విమానసేవలు ప్రారంభం కానున్నాయి. ఏపీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల అభ్యర్ధన మేరకు ఆ రెండు రాష్ట్రాలలో ఒకటి రెండు రోజుల తరువాత విమానసేవలు ప్రారంభం అవుతాయని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌ పురి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. దేశంలో కెల్లా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు కూడా నేటి నుంచే పరిమిత సంఖ్యలో విమానసేవలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ విమానాశ్రయానికి నేడు 30 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి.

అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి క్వారెంటైన్‌ అమలు విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో నిబందన విధిస్తూండటంతో విమానయాన సేవలకు ఇబ్బందికరంగా మారింది. కేరళ, పంజాబ్ రాష్ట్రాలు 14 రోజులపాటు హోం క్వారెంటైన్‌ పాటించాలని కోరుతుండగా, బీహార్ ప్రభుత్వం విమాన ప్రయాణికులు తమ సొంత ఖర్చులతో 14 రోజులపాటు ప్రభుత్వ లేదా క్వారెంటైన్‌ లాడ్జిలలో ఉండాలని కోరుతున్నాయి. అసోం రావాలనుకొనేవారు వారం రోజులు ప్రభుత్వ క్వారెంటైన్‌లో, ఆ తరువాత మరో వారం రోజుల పాటు హోం క్వారెంటైన్‌లో ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తోంది. కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి అలాగే దేశరాజధాని డిల్లీ నుంచి వచ్చేవారికి మళ్ళీ వేరేగా క్వారెంటైన్‌ నిబందనలు విధిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు.

ఈవిధంగా రకరకాల క్వారెంటైన్‌ విధానాలతో గందరగోళం ఏర్పడటంతో, ప్రయాణికులు వాటి గురించి ముందుగానే తెలుసుకొని అందుకు అంగీకరిస్తేనే బయలుదేరాలని, గమ్యస్థానం చేరిన తరువాత క్వారెంటైన్‌ నిబందనలు నచ్చక వెనక్కు తిరిగివెళ్ళాలనుకొంటే, వారు తప్పనిసరిగా తిరుగు ప్రయాణం టికెట్ కొనుగోలు చేయాల్సిందేనని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. కనుక ఇప్పుడు క్వారెంటైన్‌ నిబందనలు పెద్ద సమస్యగా మారాయి. 

రెండు నెలల తరువాత పౌర విమానాలను నడిపించడానికి సిద్దపడినప్పుడు, పౌరవిమానయాన శాఖ క్వారెంటైన్‌పై ఎటువంటి ముందస్తు ఆలోచనలు చేయలేదని దీంతో స్పష్టమవుతోంది. ఏదో ఓ రోజు మళ్ళీ విమానసేవలు ప్రారంభించాలని తెలిసి ఉన్నప్పుడు, ముందే ఇటువంటి సమస్యల గురించి ఆలోచించి ఉండాలి. కానీ సమస్యలు తలెత్తిన తరువాత ఇప్పుడు ఏమి చేయాలని ఆలోచనలు చేస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.

Related Post