రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ

May 22, 2020
img

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌ శక్తికాంత్ దాస్ శుక్రవారం ముంబైలో ప్రెస్‌మీట్‌ పెట్టి రెపో రేటును 4.40 నుంచి 4.00 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రివర్స్ రెపో రేటును 3.35 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. కరోనా.. లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌తో పాటు అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా సిమెంట్, స్టీల్ పరిశ్రమలు లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. లాక్‌డౌన్‌ కాలంలో సిమెంట్ ఉత్పత్తి 25 శాతం తగ్గడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. 

మార్చి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 15 శాతం పడిపోయిందన్నారు. కరోనా..లాక్‌డౌన్‌ ప్రభావం పెట్టుబడులపై కూడా పడిందన్నారు. దీంతో ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయడం కష్టంగా మారిందన్నారు. భారత్‌ ఆర్ధిక రంగాన్ని బలోపేతం చేయడానికి రానున్న రోజులలో మరిన్ని చర్యలు చేపడతామని చెప్పారు. అయితే దేశంలో వ్యవసాయ రంగంపై మాత్రం ఈ ప్రభావం అసలు పడలేదని, ఈసారి వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. కనుక ఇకపై వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటిస్తామని శక్తికాంత్ దాస్ చెప్పారు. 

దేశం ఆర్ధిక పరిస్థితి గురించి శక్తికాంత్ దాస్ వాస్తవిక దృక్పదంతో చెప్పడం బాగానే ఉంది. కానీ దేశం ఎదుర్కొంటున్న ఈ సమస్యలను అధిగమించడానికి కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చేపట్టిన చర్యల గురించి, ఇకపై చేపట్టబోయే వాటి గురించి ఎక్కువ ప్రస్తావిస్తే బాగుండేది. కానీ దేశంలో పరిస్థితులు బాగోలేవని చెప్పడంతో షేర్ మార్కెట్లకు తప్పుడు సంకేతాలు పంపినట్లవడంతో భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 350 పాయింట్లు పైగా నష్టపోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం షేర్లు నష్టపోయాయి. 

Related Post