నేటి నుంచి ఆ ఆరు బ్యాంకులు కనబడవు

April 01, 2020
img

దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నాలలో భాగంగా ఆరు ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగు వేర్వేరు ప్రభుత్వరంగ బ్యాంకులలో విలీనం చేసే ప్రక్రియ నేటితో పూర్తయింది. కనుక నేటి నుంచి ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యునైటడ్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కనిపించవు. వాటిని పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్‌లలో విలీనం చేశారు. 

అలహాబాద్ బ్యాంక్‌ ఇండియన్ బ్యాంక్‌లో విలీనం చేయబడింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటడ్ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేయబడ్డాయి. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో విలీనం చేయబడింది.     ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు ఇకపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పరిగణించబడతాయి.

కనుక ఆ ఆరు బ్యాంకులలో ఖాతాలన్నీ ఈ నాలుగు బ్యాంక్‌లకు బదిలీ అవుతాయి. విలీనం వలన బ్యాంక్ ఖాతాదారుల ఖాతాలు, రుణాలు, ఫిక్స్ డిపాజిట్లు, ఆర్డీలు వగైరా అన్నీ యధాతధంగా కొనసాగుతాయని తెలిపాయి. పాసుపుస్తకాలు, చెక్ బుక్‌లు, డెబిట్, క్రెడిట్ కార్డులలో ఇప్పటికిప్పుడు ఎటువంటి మార్పులు చేయకుండా దశలవారీగా మార్చే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్ సౌకర్యం ఉన్నవారు కూడా యధాప్రకారం బ్యాంకుల సేవలు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఏవైనా మార్పులు చేసినట్లయితే ఖాతాదారులకు బ్యాంకులు ఎప్పటికప్పుడు ఆ వివరాలను తెలియజేస్తాయి. కనుక ఖాతాదారులు ఈ మార్పులను గమనించాలని బ్యాంక్‌లు విజ్ఞప్తి చేశాయి.

Related Post