హైదరాబాద్‌లో ఇళ్ళ వద్దకే కూరగాయలు

March 27, 2020
img

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధ్వర్యంలో హైదరాబాద్‌ నగరంలో నేటి నుంచి ప్రజల ఇళ్ళ వద్దకే మినీ వ్యానుల ద్వారా కూరగాయలను అందించబోతున్నారు. నగరంలో మొత్తం 109 ప్రాంతాలలో 63 మినీ వ్యానుల ద్వారా కూరగాయల సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశారు. రైతుబజార్లలో ధరలకే కూరగాయలను అమ్ముతారు. ఈ కూరగాయలు అమ్మే రైతులు లేదా వ్యాపారులకు, ఆ వాహనాలను నడిపించే డ్రైవర్లకు ప్రత్యేక గుర్తింపుకార్డులు ఇచ్చారు. కనుక లాక్‌డౌన్‌ సమయంలో వారిని పోలీసులు అడ్డుకోకుండా నగరంలో అవసరమైన చోటికి వెళ్ళేందుకు అనుమతిస్తారు. ప్రతీ వాహనం నిర్ధిష్ట షెడ్యూల్ ప్రకారం ప్రతీ రెండు మూడు రోజులకోసారి వాటికి కేటాయించిన వీధులలోని అపార్టుమెంటులు, బస్తీల వద్దకు వెళ్ళి కూరగాయలు అమ్మేలా ప్రణాళిక రూపొందించారు. మళ్ళీ ఏరోజు ఎన్ని గంటలకు ఆ ప్రాంతాలకు కూరగాయల వాహనం వస్తుందో వారు ప్రజలకు తెలియజేస్తుంటారు. తద్వారా ప్రజలు కూరగాయల కోసం రైతుబజార్లకు వెళ్ళనవసరం లేదు. కూరగాయలు దొరకవేమోనని ఆందోళన చెందనవసరం ఉండదు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రమంతటా ఈ సేవలను విస్తరిస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి చెప్పారు. 

ఇళ్ళవద్దకే కూరగాయలు సరఫరా చేస్తున్నప్పటికీ ఎప్పటిలాగే రైతుబజార్లను కూడా కొనసాగిస్తామని చెప్పారు. అయితే కరోనా నేపధ్యంలో రైతుబజార్లను సమీపంలోని ఖాళీ స్థలాలకు తరలించి వినియోగదారుల మద్య కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని చెప్పారు. హైదరాబాద్‌ నగరానికి రోజుకు 20,000 క్వింటాళ్ళ కూరగాయలు అవసరం కాగా లాక్‌డౌన్‌ సమయంలో కూడా రోజుకు 21-22,000 క్వింటాళ్ళ కూరగాయలు సరఫరా అవుతున్నాయని కనుక కూరగాయలు దొరకవేమోనని ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు.

Related Post