బ్యాంకుల నుంచి రుణం పొందారా?

March 27, 2020
img

మీరు బ్యాంకుల నుంచి ఇల్లు, వాహనం లేదా మరేదైనా అవసరం కోసం రుణం పొందారా?అయితే మీకో శుభవార్త! అన్ని రకాల రుణాలపై మూడు నెలల వరకు వాటి నెలసరి చెల్లింపులు(ఈఎంఐ)లను నిలిపివేసేందుకు అన్ని బ్యాంకులకు అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్ తెలిపారు.

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగులు, వ్యాపారాలు చేసుకొనేవారి ఆదాయమార్గాలు నిలిచిపోయాయి కనుక వారు తీసుకొన్న అన్ని రకాల రుణాలపై మార్చి 1వ తేదీ నుంచి మూడు నెలలపాటు ఈఎంఐలు వసూలు చేయకుండా నిలిపివేయవచ్చని బ్యాంకులకు సూచించారు. దీనిపై బ్యాంకులు తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని తెలిపారు.

జాతీయ బ్యాంకులతో సహా గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, వాణిజ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్సీ, ఫైనాన్సింగ్ సంస్థలను ఈఎంఐ వసూళ్ళ మినహాయింపుకు  అనుమతించినట్లు గవర్నర్‌ శక్తికాంత్ దాస్ తెలిపారు.

బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు పొందినవారు ప్రతీనెల సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే వారిపై బ్యాంకుల ఒత్తిడి పెరగడమే కాకుండా వారి సిబిల్ స్కోర్‌పై కూడా ప్రభావం పడుతుంది. దాంతో మళ్ళీ రుణాలు పొందడం కష్టం అవుతుంది. కానీ గవర్నర్‌ శక్తికాంత్ చేసిన తాజా ప్రతిపాదనను బ్యాంకులన్నీ అమలుచేస్తే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొన్నవారందరికీ మూడు నెలలు ఉపశమనం లభిస్తుంది. 

Related Post