ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు కరోనా దెబ్బ

March 25, 2020
img

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో షాపింగ్ మాల్స్ అన్నీ మూతపడ్డాయి. దాంతో అవన్నీ తీవ్రంగా నష్టపోతున్నాయి. నిజానికి కరోనా భయంతో రెండువారాల ముందు నుంచే జనాలు షాపింగ్ మాల్స్ కు వెళ్ళడం తగ్గించి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌, బిగ్‌ బాస్కెట్ వంటి ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా అవసరమైన వస్తువులను ఇళ్లకే తెప్పించుకోవడం మొదలుపెట్టారు. దాంతో ఆ ఆన్‌లైన్‌ సంస్థల వ్యాపారాలు 20 శాతం వరకు పెరిగాయి. అందుకు ఆ సంస్థలు సంతోషపడేలోగానే ప్రధాని నరేంద్రమోడీ దేశంలో 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వాటికీ కష్టాలు మొదలయ్యాయి. 

లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఇళ్ళలో నుంచి బయటకు వెళ్లలేకపోతున్న ప్రజలు వాటి ద్వారా కొనుగోళ్ళు చేయాలని ప్రయత్నిస్తుండటంతో ఇంకా భారీగా బిజినెస్ చేసుకొనే అవకాశం వచ్చింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆ సంస్థలను కూడా మూసుకోవలసిరావడం, రవాణాకు సిద్దంగా ఉన్న వస్తువులను వినియోగదారుల ఇళ్ళకు చేర్చే అవకాశం లేకపోవడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌ బాస్కెట్ తదితర సంస్థలు కూడా చేతులెత్తేశాయి. ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితులలో వినియోగదారులకు సేవలు అందించలేకపోతున్నందుకు చింతిస్తున్నామంటూ మెసేజులు పెడుతున్నాయి. ఈ సంస్థలు భారత్‌తో సహా అనేక దేశాలలో వ్యాపారాలు చేస్తున్నాయి. దాదాపు అన్ని దేశాలలో కూడా కరోనా భయంతో లాక్‌డౌన్‌ చేయడంతో ఇప్పటి వరకు కోట్లు లాభాలు ఆర్జించిన ఈ ఆన్‌లైన్‌ సంస్థలు కంటికి కనబడని కరోనా దెబ్బకు భారీగా నష్టపోతున్నాయి.

Related Post