వేములవాడ హెలికాఫ్టర్‌ సర్వీసులు సూపర్ హిట్

February 22, 2020
img

నిన్న మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్‌ నుంచి వేములవాడకు వెళ్ళి వచ్చేందుకు పర్యాటక శాఖ గురువారం నుంచి హెలికాఫ్టర్‌ సర్వీసులు ప్రారంభించింది. వేములవాడ జాతరకు వచ్చిన సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో హెలికాఫ్టర్‌ సేవలు అందించడంతో శుక్రవారం ఉదయం నుంచే జనాలు హెలికాఫ్టర్‌లో ఎక్కి విహరించేందుకు క్యూ కట్టారు. వేములవాడ పట్టణం ఏరియల్ వ్యూ ప్యాకేజీకి రూ.3,000, వేములవాడ-మిడ్‌మానేరు-వేములవాడ ఏరియల్ వ్యూప్యాకేజీకి రూ.5,500కు ఛార్జీలుగా నిర్ణయించడంతో ప్రజలు ఈ అవకాశం వినియోగించుకొని హెలికాఫ్టర్‌లో ప్రయాణించాలనే ముచ్చట తీర్చుకున్నారు. దాంతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హెలికాఫ్టర్‌ వేములవాడ పట్టణంపై చక్కర్లు కొడుతూనే ఉంది. ఎన్నడూ లేనివిధంగా పట్టణంపై హెలికాఫ్టర్‌ పదేపదే చక్కర్లు కొడుతుండటంతో పట్టణంలో ప్రజలు కూడా ఆసక్తిగా చూశారు. 

ఈ హెలికాఫ్టర్‌ సర్వీసులకు మంచి ప్రజాధారణ లభించడంతో శనివారం సాయంత్రంతో ముగించాలనుకొన్న సర్వీసులను అవసరమైతే మరో రెండు రోజులు పొడిగిస్తామని హెలికాఫ్టర్‌ నిర్వాహకులు తెలిపారు. దేశంలో మద్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే దేనికైనా మంచి వ్యాపారావకాశాలు, లాభాలు ఉంటాయని చెప్పడానికి ఈ హెలికాఫ్టర్‌ సర్వీసులే ఓ చక్కటి ఉదాహరణగా నిలుస్తాయి.

Related Post