నాయకత్వ లక్షణాలంటే అవీ...

February 18, 2020
img

ఆనాడు తెలంగాణ ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను చైతన్యపరిచి తెలంగాణ సాధించిన సిఎం కేసీఆర్‌, ఇప్పుడు తన పార్టీ నేతలను చైతన్యపరిచి గొప్ప రాజకీయనాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుండటం విశేషం. ఇవాళ్ళ ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఉద్దేశ్యించి సిఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగం వింటే ఆయనలో నాయకత్వలక్షణాలు కళ్ళకు కట్టినట్లు కనబడుతాయి.  

“కొత్తగా ఎన్నికైనవారిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. అది సహజం. కానీ 5 కోట్ల మంది ప్రజలలో మీరే ఎందుకు ఎన్నికవగలిగారు? అని ఆలోచిస్తే మీ శక్తిసామర్ధ్యాలు ఏమిటో మీకే అర్ధం అవుతాయి. అలాగని పదవీ, అధికారం రాగానే అహంభావంతో ఎవరూ విర్రవీగవద్దు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తగ్గించుకొని పనులు చేయడంపై ఎక్కువ దృష్టి పెడితే మీకే మంచిది.  మనవల్ల కాని పనులు రాత్రికి రాత్రే చేసేస్తామని ఎవరికీ హామీలు ఇవ్వద్దు. ఆ తరువాత చేయలేక ప్రజలలో చెడ్డపేరు తెచ్చుకోవద్దు. మన మాట, వ్యవహారశైలి, పనితీరు అన్ని ప్రజలు హర్షించేలా ఉండాలి. అప్పుడే మీరు రాజకీయాలలో ఇంకా పైకి ఎదుగగలుగుతారు. ఆవిధంగా పనిచేస్తే ఈరోజు ఈ పదవులలో ఉన్న మీరే రేపు పెద్ద పదవులను పొందగలుగుతారు. ముందుగా ప్రజల నమ్మకాన్ని పొందేందుకు గట్టిగా ప్రయత్నించండి. ఒకసారి మీపై ప్రజలకు గురి ఏర్పడితే వారు మీవెంటే ఉంటారు. ప్రజాశక్తిని సమీకృతం చేయగలిగితే గొప్ప కార్యక్రమాలు చేయగలం. గొప్ప ఫలితాలు సాధించగలం. ఆశించిన ఫలితాలు సాధించగలిగినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం దానంతట అదే పెరుగుతుంది. ఒకప్పుడు రాజకీయాలలో త్యాగాలు, బలిదానాలు చేయవలసి వచ్చేది. కానీ ఇప్పుడు చాలా సౌకర్యవంతమైన రాజకీయాలు చేసుకొనే వెసులుబాటు ఉంది.         

మనం కోట్లాడి తెలంగాణ సాధించుకొన్నది ప్రజల ఆకాంక్షల కోసమే. కనుక అందరూ ఒక ప్రణాళికబద్దంగా, నిజాయితీగా కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొందాము. ఎల్లప్పుడూ మనం విదేశాల గురించి గొప్పగా చెప్పుకొని అబ్బురపడటం కాదు. మనల్ని చూసి ఇతర దేశాలు అబ్బురపడే స్థాయికి ఎదగాలి. అందుకు నిజాయితీగా, కష్టపడి పనిచేయడం ఒక్కటే మార్గం. మున్సిపాలిటీ అంటే మురికి.. చెత్త...అవినీతి.. పర్యాయపదాలుగా వాడుకలో ఉన్నాయంటే అవి మనకు ఎంత అవమానకరమో అందరూ గ్రహించాలి. బల్దియా ..ఖాయా పీయా చల్దియా..అనే సామెతలు ఊరికే రాలేదు. మనం పారదర్శకంగా, అవినీతిరహితంగా, చురుకుగా పనులు చేసి చూపించి ఆ చెడ్డపేరును తొలగించుకొందాము. మీకందరికీ వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే భవిష్యత్‌ నేతలు మీరే అవుతారు,” అని సిఎం కేసీఆర్‌ ఉద్బోధ చేశారు. 

సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే ఇటువంటి సమావేశాలలో సొంత డబ్బా కొట్టుకొంటూ, ప్రత్యర్దులను విమర్శించడంతోనే పూర్తవుతుంటాయి. కానీ సిఎం కేసీఆర్‌ అందుకు పూర్తి భిన్నంగా వాస్తవ పరిస్థితులను తమ పార్టీ నేతలకు చక్కగా వివరించి, ఏవిధంగా ముందుకు సాగితే విజయం సాధించగలరో చాలా చక్కగా వివరించారు. సిఎం కేసీఆర్‌ వారికి చెప్పినవన్నీ అక్షరాల ఆచరించి చూపారు కనుకనే ఆయన ఈ స్థాయికి ఎదిగి అత్యంత ఆత్మవిశ్వాసం, అత్యంత ప్రజాధారణ కలిగిన నేతగా ఎదిగారు. కానీ సిఎం కేసీఆర్‌ ఏమాత్రం స్వోత్కర్షకు పోకుండా పార్టీ నేతలకు చాలా చక్కగా దిశానిర్దేశం చేశారు. బహుశః ఇంతకంటే బాగా ఎవరూ వారికి చెప్పలేరేమో? ఒక నాయకుడిగా కేసీఆర్‌ వారికి చక్కగా కర్తవ్యాన్ని భోదించి మార్గదర్శనం చేశారు. మరి వారిలో ఎంతమంది ఆయన మాటలను ఆకళింపు చేసుకొని విజయం సాధిస్తారో కాలమే చెపుతుంది. 

Related Post