హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు కేసీఆర్‌ సూచన

February 08, 2020
img

ఎంజీబీఎస్-జెబిఎస్ కారిడార్‌లో శుక్రవారం మెట్రో సర్వీసులను ప్రారంభించిన సిఎం కేసీఆర్‌, మెట్రో స్టేషన్‌లో తిరిగి పరిశీలించారు. అనంతరం కాసేపు మెట్రో రైల్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రో అధికారులు ఆయనకు మెట్రో రైళ్ళలో, మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను, అత్యాధునిక టెక్నాలజీ గురించి సిఎం కేసీఆర్‌కు వివరించారు. మెట్రో రైలు ప్రయాణం చాలా అద్భుతమైన అనుభూతిని కలిగించిందని సిఎం కేసీఆర్‌ మెచ్చుకొన్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. నగరంలో మరో 80-100 కిమీ మెట్రోను విస్తరించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని సిఎం కేసీఆర్‌ మెట్రో అధికారులను కోరారు. ఇటు ఎల్బీ నగర్ నుంచి హయాత్ నగర్ వరకు, అటు మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు మెట్రోను విస్తరించాలని కోరారు. అలాగే వీలైనంత త్వరగా శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరించాలని సిఎం కేసీఆర్‌ కోరారు.   

హైదరాబాద్‌లో మెట్రో సేవలు ప్రారంభించి రెండేళ్ళుపైనే అయ్యింది కనుక దాని నిర్వహణలో లాభనష్టాలు, సమస్యలు, సవాళ్ళు అన్నిటి గురించి అటు మెట్రో యాజమాన్యానికి, ఇటు  ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఏర్పడింది. అలాగే నానాటికీ మెట్రోకు ప్రజాధారణ పెరుగుతోంది కనుక చాలా లాభసాటిగానే నడుస్తోంది. సిఎం కేసీఆర్‌ స్వయంగా ఈ ప్రతిపాదన చేశారు కనుక నగరంలో మరో 80-100 కిమీ మెట్రోను విస్తరించడం ఖాయమేనని భావించవచ్చు. మరో 2-3 ఏళ్ళలో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందేమో?

Related Post