లలితా జ్యూవెలరీలో బంగారు నగలు చోరీ

January 22, 2020
img

హైదరాబాద్‌, పంజగుట్ట వద్దగల లలితా జ్యూవెలరీలో దొంగతనం జరిగింది. అయితే ఈ ఘటన జనవరి 15న జరుగగా ఇప్పటి వరకు బయటపడలేదు. ఆరోజున కొంతమంది వ్యక్తులు, మహిళలలో కలిసి లలితా జ్యూవెలరీకి వచ్చి నగలు చూడటం మొదలుపెట్టారు. వారు కౌంటరులోని వ్యక్తులను మాటలలో పెట్టి కొన్ని బంగారు నగలు దొంగిలించారు. కానీ షాపు సిబ్బంది ఆ విషయం వెంటనే గుర్తించలేకపోయారు. వారాంతంలో నగల ఆడిటింగ్ చేసినప్పుడు 92 గ్రాములు తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో నగలు దొంగతనం జరిగినట్లు గ్రహించారు. వెంటనే షాపు మేనేజర్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలించగా జనవరి 15న వచ్చిన ఒక బృందం ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం 92 గ్రాముల బరువున్న రెండు బంగారు గొలుసులు, ఒక బ్రేస్‌లెట్‌ను వారు దొంగిలించినట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.3.5 లక్షలుంటుందని అంచనా వేశారు. 

గత ఏడాది తమిళనాడులోని లలితా జ్యూవెలరీలో సుమారు రూ.3 కోట్లు విలువైన నగలు దొంగిలించబడ్డాయి. అయితే పోలీసులు చాలా చురుకుగా స్పందించి దొంగలను పట్టుకొని వాటిని స్వాధీనం చేసుకొన్నారు. “డబ్బెవరికీ ఊరికే రాదు...”అంటూ లలితా జ్యూవెలరీ యజమాని కిరణ్ కుమార్ టీవీ యాడ్స్ లో చెపుతుంటే, ఆయన దుకాణంలో నుంచే నగలు కొట్టేసి డబ్బు సంపాదించుకోవాలని దొంగలు ప్రయత్నిస్తుండటం విశేషం.

Related Post