హైదరాబాద్‌ మెట్రోతో రెడ్ బస్ అనుసంధానం

January 21, 2020
img

ఆన్‌లైన్‌లో బస్సు టికెట్లు బుక్‌ చేసుకొనేందుకు ఏర్పాటైన ‘రెడ్ బస్’ ఇప్పుడు హైదరాబాద్‌ మెట్రోతో అనుసంధానం అయ్యింది. మెట్రో ప్రయాణికులు స్టేషన్ల నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు ఆటోలు, బస్సులు, క్యాబ్‌లలో ప్రయాణిస్తుంటారు. తక్కువ ఖర్చుతో వెళ్లాలనుకొనేవారు షేరింగ్ ఆటోలు, వ్యాన్లలలో వెళుతుంటారు. కానీ షేరింగ్ వాహనాలలో సమయానికి గమ్యస్థానాలు చేరుకోవడం కొంచెం కష్టమే. పైగా షేరింగ్ వాహనాల యజమానులు వీలైనంత ఎక్కువమందిని ఎక్కించుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు కనుక వాటిలో ప్రయాణించడం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. 

ఈ సమస్యలను గుర్తించిన రెడ్ బస్ సంస్థ నగరంలో అన్ని మెట్రో స్టేషన్లవద్ద ఆర్‌-పూల్ పేరిట కార్ పూలింగ్ సేవలను ప్రారంభించబోతోంది. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ఉదయం హైటెక్ సిటీలో ఈ కార్ పూలింగ్ సేవలను ప్రారంభించనున్నారు. 

ఈ సేవలను ఉపగించుకోవాలనుకొనే మెట్రో ప్రయాణికులు ముందుగా తమ మొబైల్ ఫోన్లలో రెడ్ బస్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని తమ వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది. తరువాత దానిలోగల ‘ఆర్‌-పూల్’ ఆప్షన్‌ ద్వారా తాము ఏ స్టేషన్ నుంచి ఎక్కడకు ప్రయాణించాలనుకొంటున్నారో తెలియజేసి వాహనాలను బుక్‌ చేసుకోవచ్చు. మరో విశేషమేమిటంటే దీనిద్వారా షేరింగ్ బైకులు కూడా బుక్‌ చేసుకోవచ్చు. అంతేకాదు..తమ సొంత వాహనాలలో ఇతరులను ఎక్కించుకొని తీసుకువెళ్ళేందుకు ఇష్టపడేవారు ఆ వివరాలను నమోదు చేసుకోవచ్చు. తద్వారా వాహనయజమానులకు, వాటిని వినియోగించుకొనేవారికీ కూడా లాభపడతారు.


Related Post