భారత్‌లో 39వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న అమెజాన్

January 18, 2020
img

అంతర్జాతీయ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ భారత్‌ పర్యటనకు వచ్చారు. దేశంలో చిన్న, మద్య తరహా వ్యాపారాల కోసం జరిగిన సంభవ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఆయన డిల్లీ వచ్చారు. దానిలో ఆయన మాట్లాడుతూ, "మొదట్లో నేనే స్వయంగా పోస్టాఫీసులకు పార్సిల్స్ మోసుకొనివెళ్ళేవాడిని. నేడు అమెజాన్ ఈ స్థాయికి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా లక్షలమందికి ఉద్యోగ ఉపాది అవకాశాలు కల్పిస్తూ, కోట్లాదిమందికి సేవలు అందిస్తుండటం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. ప్రపంచదేశాలలో అమెరికా తరువాత మాకు భారత్‌ మార్కెట్ అత్యంత నమ్మకమైన, కీలకమైనదిగా భావిస్తున్నాను. అందుకే భారత్‌లో ఏడాదికి రూ.7,000 కోట్లు చొప్పున రానున్న 5 ఏళ్ళలో మొత్తం రూ.39,000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకొన్నాము. దేశంలో చిన్న, మద్య తరహా వ్యాపారులకు మేలు కలిగేలా ఈ పెట్టుబడులను వినియోగిస్తాము. తద్వారా 2025 నాటికి భారత్‌ నుంచి రూ.70,000 కోట్లు విలువైన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలనేది మా లక్ష్యం,” అని చెప్పారు. 

అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థ భారత్‌లో ఇంత భారీగా పెట్టుబడులు పెట్టాలనుకోవడం చాలా గొప్ప విషయమే. అది అంతర్జాతీయ కంపెనీలకు భారత్‌పై ఉన్న నమ్మకానికి, అలాగే భారత్‌లో ఉన్న వ్యాపార అవకాశాలకు చక్కటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. విదేశీసంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి భారత్‌ ప్రయత్నిస్తోంది కనుక అమెజాన్ పెట్టుబడులను స్వాగతించాల్సిందే. 

అయితే జెఫ్ బెజోస్ ప్రకటనపై కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి పీయూష్ గోయల్ ఇందుకు భిన్నంగా స్పందించడం విశేషం. డిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అమెజాన్ భారత్‌లో పెట్టుబడులు పెట్టడం భారత్‌ కోసం కాదు. దానికి వ్యాపారాలలో వస్తున్న నష్టాలను పూడ్చుకొని తన వ్యాపారాలను ఇంకా విస్తరించడానికె పెట్టుబడులు పెడుతోంది తప్ప భారత్‌కు ఏదో మేలు చేయాలని మాత్రం కాదు. భారత్‌లో వ్యాపారాలు చేయాలనుకొనే ఏ ఈ-కామర్స్ సంస్థలైనా ఇక్కడి నియమనిబందనలకు లోబడే చేసుకోవాలి తప్ప వ్యవస్థలలోని లోపాల ఆధారంగా కాదని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.          

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు ప్రజలను ఆకట్టుకొనేందుకు భారీ డిస్కౌంట్ల పేరుతో అనుసరిస్తున్న అనుచిత వ్యాపారవిధానాలపై  కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విచారణ జరుపుతున్న సమయంలో జెఫ్ బెజోస్ డిల్లీకి వచ్చి భారత్‌లో రూ.39,000 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించడంతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈవిధంగా స్పందించారు. 

Related Post