పట్టాలపైకి మరో ప్రైవేట్ రైలు

January 16, 2020
img

దేశంలో తొలిసారిగా లక్నో-డిల్లీ మద్య ‘తేజస్ ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో ప్రైవేట్ రైలును ప్రవేశపెట్టారు. రైల్వేకు అనుబంధంగా పనిచేస్తున్న ఐఆర్‌సీటీసీ అధ్వర్యంలో అది చాలా లాభసాటిగా…విజయవంతంగా..నడుస్తుండటంతో దాని ఆధ్వర్యంలోనే నేడు మరో ప్రైవేట్ రైలు ‘తేజస్ ఎక్స్‌ప్రెస్‌’ను రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. 

ముంబై-అహ్మదాబాద్ మద్య నడిచే ఈ తేజస్ ఎక్స్‌ప్రెస్‌ సేవలు ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఒక్క గురువారం తప్ప వారంలో ఆరు రోజులు ఈ తేజస్ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తుంది. దీనిలో రెండు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ చైర్‌కార్స్‌, ఎనిమిది చైర్‌ కార్స్‌ ఉంటాయి. దీని టికెట్స్ ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్ వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌లో బుక్‌ చేసుకోవచ్చు.  రైల్వేకౌంటర్లలో తేజస్ ఎక్స్‌ప్రెస్‌ టికెట్స్ లభించవని ఐఆర్‌సీటీసీ తెలిపింది. 

సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళకు భిన్నంగా తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉంటాయి. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. ఏ కారణం చేతైనా నిర్ణీత సమయానికి ట్రైన్ గమ్యస్థానం చేరుకోలేకపోతే ఐఆర్‌సీటీసీయే ప్రయాణికులకు జరిమానా చెల్లిస్తుంది. 


దేశప్రజలలో సగంగాపైగా దారిద్ర్యంతో బాధపడుతున్నప్పటికీ, మిగిలినవారు ఇటువంటి సుఖవంతమైన విలాసవంతమైన ప్రయాణాల కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. ఇప్పుడు దాదాపు అన్ని రైళ్ళలో ఫస్ట్, సెకండ్ ఏసీలో సైతం టికెట్స్ లభించడం లేదు. దేశ ప్రజల ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చిందని, వారి కొనుగోలు సామర్ధ్యం పెరిగిందని ఇది సూచిస్తోంది. కనుకనే  ఈ తేజస్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళకు కూడా చాలా ఆదరణ లభిస్తోందని చెప్పవచ్చు. కనుక భవిష్యత్‌లో దేశంలో రిలయన్స్ రైళ్ళు, టాటా రైళ్ళు పట్టాలపై పరుగులు తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Related Post