తొలిసారిగా హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ ఆటోలు

December 13, 2019
img

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలలో నానాటికీ జనాభా...వాహనాల రద్దీ పెరుగుతూనే ఉంది. గత 10 ఏళ్ళలో నగరంలో వాహనాల సంఖ్య దాదాపు రెట్టింపు అయినట్లు గణాంకాలు చెపుతున్నాయి. వాహనాలు పెరిగేకొద్దీ ట్రాఫిక్ సమస్యలు...శబ్ధ, వాయు కాలుష్యం కూడా పెరిగిపోతోంది. ఎన్ని ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటిఎస్ రైళ్లు తిరుగుతున్నప్పటికీ రోడ్లపై తిరిగే వాహనాలు ఏమాత్రం తగ్గడం లేదు కనుక వాయుకాలుష్యం కూడా తగ్గడం లేదు. వాహనాల నుంచి వెలువడే ప్రమాదకరమైన విషవాయువుల కారణంగా నగరవాసులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

కనుక జంటనగరాలలో ప్రధానకూడళ్లలో వాహనాల నుంచి వెలువడే విషవాయువులను పీల్చుకొని శుద్ధిచేసి విడుదల చేసే ఎయిర్ ప్యూరిఫైర్స్ ను జీహెచ్‌ఎంసీ త్వరలోనే ఏర్పాటు చేయబోతోంది. అయితే వాయుకాలుష్యానికి ఇది పూర్తి పరిష్కారం కాదని అందరికీ తెలుసు. నగరమంతటా పచ్చని చెట్లను పెంచడం, వీలైనంత వరకు అందరూ సొంత వాహనాలను పక్కనపెట్టి ప్రజారవాణా వ్యవస్థలైన ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటిఎస్ రైళ్లలో ప్రయాణించడం కొన్ని మార్గాలని అందరికీ తెలుసు.

 ఇవి కాక వాయుకాలుష్యం చేయని ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం మరో మార్గం. నగరంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. తాజాగా ‘ఈ-యాన’ సంస్థ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను కూడా హైదరాబాద్‌లో ప్రవేశపెట్టింది. ఇవి ఏమాత్రం శబ్ధం చేయవు. ఎటువంటి విషవాయువులను విడుదల చేయవు కనుక ఎకో-ఫ్రెండ్లీ వాహనాలని చెప్పవచ్చు. గత 10 ఏళ్లుగా సోలార్ ఎనర్జీ రంగంలో అనేక పరిశోధనలు చేసి రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తున్న తాము దేశంలో నానాటికీ పెరిగిపోతున్న శబ్ధ, వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను తయారుచేశామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ తెలిపారు. 

Related Post