జియో గేమ్ షురు?

November 20, 2019
img

దేశంలో టెలికాం రంగంలో పెను మార్పులకు దోహదపడిన రిలయన్స్ జియో సంస్థే దేశంలో బిఎస్ఎన్ఎల్‌తో సహా అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు మూతపడేలా చేసిందని చెప్పక తప్పదు. జియో దెబ్బకు తట్టుకోలేక...అలాగని నడుస్తున్న వ్యాపారాలను ఒక్కసారిగా మూసుకోలేక కొనసాగించిన పాపానికి టెలికాం కంపెనీలు వేలకోట్లు నష్టాలపాలై చివరికి మూసుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ కంపెనీ కూడా భారీగా అప్పులపాలై దివాళా తీసింది. ఇంకా బరిలో ఉన్న ఎయిర్ టెల్ వంటి మూడు నాలుగు ప్రైవేట్ ఆపరేటర్లు కూడా నష్టాల ఊబిలో కూరుకుపోయి దాని నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే ఒక్క జియో మాత్రమే లాభాల బాటలో దూసుకుపోతోందంటే పరిస్థితులు అర్ధం చేసుకోవచ్చు. 

మొదట నామమాత్రపు ధరలకే అపరిమితమైన కాల్స్, డేటాను అందించడం ద్వారా దేశంలో ఇతర టెలికాం కంపెనీల వినియోగదారులందరినీ జియో తనవైపు తిప్పుకొంది. ఇప్పుడు పోటీదారులందరూ ఒకరొకరుగా తప్పుకొంటుండటంతో ఇక జియో ఏకఛత్రాధిపత్యంగా వ్యాపారం చేసుకోవడానికి సిద్దం అవుతోంది. 

ఇప్పటికే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ పై అధనపు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తరువాత  కాల్స్, డేటా ఛార్జీలను పెంచడానికి జియో సిద్దం అవుతున్నట్లు సమాచారం. అలాగే ప్లాన్ కాలపరిమితిని కుదించబోతున్నట్లు తెలుస్తోంది. 

కనుక ఇంకా బరిలో ఉండి నష్టాలతో సతమతమవుతున్న ఉన్న మూడు నాలుగు టెలికాం కంపెనీలు కూడా జియోతో పాటు ఛార్జీలు పెంచడం ఖాయమే. అయితే ఈ పెంపుతో అవి నష్టాల ఊబిలో నుంచి బయటపడలేవు కనుక ఏదో ఒకరోజు మూసుకోక తప్పదు. అప్పుడు జియో ఆడిందే ఆట... పాడిందే పాటవుతుంది. అప్పుడు వినియోగదారులకు వేరే గత్యంతరం ఉండదు కనుక జియోతో వేగక తప్పకపోవచ్చు.

Related Post