కంపెనీ దివాళా...అనిల్ అంబానీ రాజీనామా

November 16, 2019
img

రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీతో సహా మరో నలుగురు డైరెక్టర్లు శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. శుక్రవారం విడుదల చేసిన త్రైమాసిక నివేదికలో కంపెనీకి రూ.30,142 కోట్లు నష్టాలు వచ్చాయి. ఇప్పటికే భారీ నష్టాలపాలైన ఆర్‌కామ్ సంస్థ ఈ తాజా నష్టాలతో పూర్తిగా దివాళా తీసినట్లవడంతో అనిల్ అంబానీతో సహా డైరెక్టర్లు రాజీనామాలు చేశారు. 

ఈరోజు రాజీనామాలు చేసిన డైరెక్టర్లలో చాయా విరాణి, రైనా కరాని, మంజరి కాకెర్, సురేశ్ రంగాచార్ ఉన్నారు. కంపెనీ చీఫ్ ఫీనాన్షియల్ ఆఫీసర్ మణికంఠన్‌ ఇదివరకే రాజీనామా చేశారు. వారి రాజీనామాల గురించి కంపెనీ బీఎస్ఈకి లేఖ ద్వారా తెలియజేసింది. ఆర్‌కామ్ కంపెనీ దివాళా తీయడంతో అప్పులు తీర్చేందుకు త్వరలో దాని ఆస్తులు అమ్మకానికి పెట్టబోతున్నారు. 

అన్న ముఖేష్ అంబానీ స్థాపించిన జియో సంస్థ కేవలం మూడేళ్ళనే కోటి మందికి పైగా వినియోగదారులను సంపాదించుకొని, లాభాలు గడిస్తుంటే చాలా కాలం క్రితం తమ్ముడు అనిల్ అంబానీ స్థాపించిన రిలయన్స్ కమ్యూనికేషన్ దివాళా తీయడం చాలా ఆశ్చర్యకరమే. ఇప్పటికే వోడా ఫోన్, బీఎస్ఎన్ఎల్, ఐడియా టెలికాం కంపెనీలు తీవ్ర నష్టాల పాలయ్యాయి. ప్రస్తుతం ఒక్క ఎయిర్ టెల్ మాత్రం ఇంకా బరిలో కొనసాగుతోంది. దానికీ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.23,000 కోట్లు నష్టాలు వచ్చాయి. బహుశః భవిష్యత్‌లో దేశంలో ఒక్క జియో కంపెనీ ఒక్కటే మిగిలినా ఆశ్చర్యం లేదు.

Related Post