వ్యసనంగా మారుతున్న ఆన్‌లైన్‌ షాపింగ్!

November 06, 2019
img

భారత్‌తో సహా ప్రపంచదేశాలలో ఆన్‌లైన్‌ షాపింగ్ బిజినెస్ శరవేగంగా పెరుగుతోంది. ఇటీవల దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఆన్‌లైన్‌ షాపింగ్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కార్ట్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో రెండు వారాల వ్యవధిలోనే వందల కోట్లు విలువగల ఉత్పత్తులను అమ్మాయి. ఈ విషయం ఆ సంస్థలే స్వయంగా ప్రకటించాయి కూడా. బహిరంగ మార్కెట్లో చిన్న, మద్య తరహా వ్యాపారసంస్థలు తమ జీవితకాలంలో అంత వ్యాపారం చేయలేవంటే అతిశయోక్తి కాదు.  

ఫ్రిజ్, టీవీ, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటి పెద్ద గృహోపకరణాలు మొదలు కూరగాయలు, పప్పొప్పులు వంటి నిత్యావసర సరుకులు, బట్టలు, చెప్పులు, మొక్కలు, కేకులు, స్వీట్లు, మందులు వంటివన్నీ ఆన్‌లైన్‌లోనే ఇంటికి వచ్చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లో ఆయా వస్తువులను అమ్ముతున్న అనేక వ్యాపారసంస్థలు నష్టాలలో కూరుకుపోయి మూతపడుతున్నాయి కూడా. దాంతో వాటిపై ఆధారపడిన లక్షలాది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. 

ఇంతకీ ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రజలు ఎందుకు ఇష్టపడుతున్నారు? అంటే అనేక కారణాలు కనిపిస్తునాయి. అనేక వేలరకాల ఉత్పత్తులన్నీ ఒకే చోట లభ్యమవుతుండటం, నాణ్యమైన సరుకులు, వాటిపై మళ్ళీ ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, నాణ్యమైన సేవలు అన్నీ ఇంట్లో కూర్చొని ఒక ‘క్లిక్’తోనే కొనుగోలు చేసే అవకాశం ఉండటమే కారణాలుగా కనిపిస్తున్నాయి. 

ఏ వస్తువునైనా వాయిదాల పద్దతిలో కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, బాజాజ్ ఫైనాన్స్ వంటి ఆర్ధిక సంస్థలు సహకారం అందిస్తుండటంతో ప్రజలలో ఆన్‌లైన్‌ కొనుగోళ్ళపై ఆసక్తి మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఇక మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఆన్‌లైన్‌ కొనుగోళ్ళు మరింత పెరిగాయి. 

సాధారణంగా షాపులలో డబ్బు చెల్లించి వస్తువులు కొంటున్నప్పుడు ‘డబ్బు ఖర్చు చేస్తున్నామనే భయం లేదా జాగ్రత్త’ ఉంటుంది. కానీ ఆన్‌లైన్‌ చెల్లింపులు చేస్తున్నప్పుడు బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బు వెళ్ళిపోతుంటుంది కనుక కంటికి కనబడదు కనుక అంత భయం ఉండదు. 

ఇటువంటి అనేక కారణాల చేత ప్రపంచ ప్రజలలో నానాటికీ ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేయడం ఒక వ్యసనంగా మారిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో ప్రకటించింది. అవసరం ఉన్నా లేకపోయినా రోజూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌, వాట్స్ అప్‌ వంటి సోషల్ మీడియాలో మెసేజులు పంపడం, చూసుకోవడం నేడు ఏవిధంగా ఒక వ్యసనంగా మారిపోయిందో, ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేస్తుండటం కూడా వ్యసనంలా మారిపోతోందని, దీని వలన కుటుంబాల ఆర్ధిక పరిస్థితులు తలక్రిందులయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో ప్రకటించింది. కనుక ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే వినియోగదారులారా...బహుపరాక్! 

Related Post