ప్రగతి రధ చక్రాలకు బ్రేక్...మెట్రో పరుగులు

October 19, 2019
img

ఆర్టీసీ, క్యాబ్‌లు నిరవధిక సమ్మె..తెలంగాణ బంద్‌ నేపధ్యంలో హైదరాబాద్‌ మెట్రో శనివారం ఉదయం నుంచి ప్రతీ 3 నిమిషాలకు ఒక మెట్రో రైల్‌ నడిపించడం ప్రారంభించింది. తద్వారా ఈ ఒక్క రోజే 4 లక్షల మంది ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మెట్రో నగరంలో దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలను కలుపుతున్నందున నగర ప్రజలు మెట్రోలో ప్రయాణించేందుకు తరలిరావడం ఖాయం. కనుక మెట్రో అధికారులు అధనపు రద్దీని తట్టుకునే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మెట్రో రైల్‌ రాక ముందు నుంచి నగర ప్రజలకు సేవలందిస్తున్న ఎంఎంటిఎస్ రైళ్లు కూడా నేడు అధనపు సర్వీసులు నడిపించేందుకు ఏర్పాట్లు చేసుకొంది. సికింద్రాబాద్‌ బొల్లారం మద్య నడిచే ఎంఎంటిఎస్ డెమూ రైలును నేడు మేడ్చల్ వరకు నడిపించబోతున్నామని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ తెలియజేశారు. ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్‌–లింగంపల్లి మార్గాలలో ఎంఎంటిఎస్ రైళ్లు యధాప్రకారం నడిపిస్తామని తెలిపారు. సుమారు 1.5 లక్షల మంది నేడు ఎంఎంటిఎస్ రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Related Post