భారత్‌లో రూ.1,845 కోట్లు పెట్టుబడి పెడుతున్న ఫ్లిప్‌కార్ట్

October 16, 2019
img

ప్రముఖ ఆన్‌లైన్‌ ఈ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ విస్తృతమైన, నమ్మకమైన ఉత్పత్తులు, సేవలు అందిస్తూ అతితక్కువ కాలంలోనే కోట్లాది భారతీయుల ఆదరణ పొందగలిగింది. ఫ్లిప్‌కార్ట్ త్వరలో మరో కొత్త వ్యాపారంలోకి ప్రవేశించబోతోంది. రైతులు ఉత్పత్తి చేస్తున్న ఆహార పదార్ధాలను సేకరించి వాటిని ‘ప్యాకేజ్‌డ్ ఫుడ్‌’ పద్దతిలో నేరుగా వినియోగదారులకు అందజేయనుంది. దీనికోసం ఫ్లిప్‌కార్ట్ వేరేగా ‘ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్‌మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే పేరుతో సంస్థను రిజిస్టర్ చేయించింది. ఈ సంస్థ ద్వారా ఫ్లిప్‌కార్ట్ భారత్‌లో రూ.1,845 కోట్లు పెట్టుబడి పెట్టబోతోందని ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి తెలియజేశారు. రైతుల నుంచి సేకరించిన ఆహార ఉత్పత్తులను ‘ప్యాకేజ్‌డ్ ఫుడ్‌’ పద్దతిలో తమ ఆన్‌లైన్‌, ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా విక్రయిస్తామని తెలిపారు. దీని వలన అటు రైతులు, ఇటు లక్షలాది ప్రజలు లాభపడతారని అన్నారు. 

ఫ్లిప్‌కార్ట్ కు ప్రధానపోటీదారుగా నిలుస్తున్న అమెజాన్ కూడా ‘అమెజాన్ ఫ్రెష్’ పేరుతో ప్యాకేజ్‌డ్ ఫుడ్‌ బిజినెస్‌లోకి ప్రవేశిస్తోంది. అది కూడా రాగల 10 ఏళ్ళలో భారత్‌లో సుమారు 500 యూఎస్ మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టబోతోంది. ఇక బిగ్‌ బాస్కెట్ వంటి అనేక ఈకామర్స్ సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 

భారత్‌లో వాహనాల తయారీ రంగంపై ఆర్ధికమాంద్యం ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జోమోటో, స్వీగ్గీ వంటి ఈ కామర్స్ సంస్థలు లాభాలలో దూసుకుపోతుండటం విశేషం. 133 కోట్లు జనాభా ఉన్న భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద ‘వినిమయమార్కెట్’ అని ప్రపంచదేశాలు కూడా గుర్తించినందునే భారత్‌లో ఇంత భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దం అవుతున్నాయని చెప్పవచ్చు. 

Related Post