మెట్రోకు వరంగా మారిన ఆర్టీసీ సమ్మె

October 15, 2019
img

టిఎస్ఆర్టీసీ సమ్మె హైదరాబాద్‌ మెట్రోకు వరంగా మారింది. ఆర్టీసీ సమ్మె కారణంగా నగరంలో తగినన్ని బస్‌ సర్వీసులు లేకపోవడంతో ప్రజలు ఆటోలు, వ్యానులు, ప్రైవేట్ బస్సులను ఆశ్రయించవలసివస్తోంది. కానీ వారు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తుండటంతో నగరప్రజలు మెట్రోలో ప్రయాణించడం మొదలుపెట్టారు.

ఆర్టీసీ సమ్మె జరుగక మునుపు మెట్రోలో రోజుకు 3 లక్షల లోపు ప్రయాణించేవారు. సమ్మె మొదలైనప్పటి నుంచి మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య రోజుకు 3.65 లక్షలకు చేరుకొంది. నిన్న అంటే సోమవారం అత్యధికంగా 3.80 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం 3.05 లక్షల మంది ప్రయాణించగా, రాత్రి 8 నుంచి 11.30 లోగా 75,000 మంది ప్రయాణించారని తెలిపారు. ఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం వలననే ఇది సాధ్యపడిందని చెప్పారు.

ప్రధాన స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసి, అదనపు రైల్స్ నడిపిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సమ్మెకు ముందు అన్ని మార్గాలలో కలిపి రోజుకు 810 ట్రిప్పులు నడిపించేవారిమని ఇప్పుడు రోజుకు 910 నడిపిస్తున్నామని తెలిపారు. ఎల్బీ నగర్, సికింద్రాబాద్‌, అమీర్‌పేట, హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని తెలిపారు. అవసరమైతే మరిన్ని అదనపు ట్రిప్పులు నడిపించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.

Related Post