జియో బాదుడు షురూ!

October 11, 2019
img

మూడేళ్ళ క్రితం మార్కెట్ లోకి ప్రవేశించిన రిలయన్స్ జియో అపరిమిత ఉచిత కాల్స్ సౌకర్యం కల్పించడం ద్వారా స్వల్ప వ్యవధిలోనే కోట్లాదిమంది ఖాతాదారులను సంపాదించుకోగలిగింది. జియో దెబ్బకు బి‌ఎస్ఎన్ఎల్ తో సహా అనేక కంపెనీలు ఖాతాదారులను కోల్పోయాయి. జియోతో పోటీ పడలేక నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. దేశంలో తనకు పోటీలేకుండా చేసుకొని, మార్కెట్‌పై పూర్తి పట్టు సాధించిన తరువాత ఇప్పుడు జియో తన నిజస్వరూపం బయటపెట్టింది. 

ఇప్పటి వరకు అపరిమిత ఉచితకాల్స్ అందించిన జియో, ఇకపై ఇతర నెట్‌వర్క్‌ లకు చేసే అవుట్ గోయింగ్ కాల్స్ పై నిమిషానికి ఆరుపైసలు వసూలు చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 9వ తేదీ లోగా రీ చార్జ్ చేసుకున్నవారికి మాత్రం ఆ ప్లాన్ గడువు ముగిసేవరకు యధావిధిగా ఏ నెట్‌వర్క్‌ కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చునని జియో ప్రకటించింది. తద్వారా గడువు తరువాత అందరికీ వడ్డన తప్పదని తెలియజేసిందనుకోవచ్చు. 

జియో మళ్ళీ ‘పర్ మినిట్ కాల్స్’ పద్దతి ప్రవేశపెడుతున్నందున, మిగిలిన టెలికాం కంపెనీలు కూడా చాలా సంతోషంగా దాని బాటలోనే సాగుతూ తమ ఖాతాదారుల నుంచి ముక్కు పిండి డబ్బు వసూలు చేయడం తధ్యం. ఇప్పటి వరకు అపరిమిత కాల్స్ చేసుకోవడానికి అలవాటుపడిన జనాలు మళ్ళీ నిమిషాలు లెక్కపెట్టుకొంటూ మాట్లాడుకోవడానికి సిద్దపడక తప్పదు.

Related Post