న్యూజెర్సీ-తెలంగాణ రాష్ట్రాల మద్య ఒప్పందం

September 19, 2019
img

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం భారత్‌లోని తెలంగాణ రాష్ట్రాల మద్య సిస్టర్ స్టేట్ పార్ట్‌నర్‌షిప్ ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌ నగరంలో లోయర్ ట్యాంక్‌బండ్‌ వద్ద గల మారియట్ హోటల్‌లో బుదవారం ఐసిసి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఐ‌టిశాఖమంత్రి కేటీఆర్‌ సమక్షంలో న్యూజెర్సీ గవర్నర్‌ ఫిలిప్‌మర్ఫీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కె జోషి ఈ ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో ఐ‌టి, మీడియా, డాటా సెంటర్స్, క్లీన్ ఎనర్జీ, హెల్త్ కేర్, ఉన్నత విద్య, ఫార్మా, లైఫ్ సైన్సస్, బయోటెక్, ఫిన్‌టెక్, పర్యాటకం, సాంస్కృతిక మొదలైన రంగాలలో న్యూజెర్సీ- తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటాయి.  

ఈ సందర్భంగా ఫిలిప్‌మర్ఫీ మీడియాతో మాట్లాడుతూ, “మా ఈ పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు చాలా అనుకూలమైన వాతావరణం కనిపించింది. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో తెలంగాణ రాష్ట్రం చాలా ముందంజలో ఉంది. కనుక పరస్పరం సహకరించుకొంటూ వివిద రంగాలలో అభివృద్ధి సాధిస్తామనే నమ్మకం మాకుంది,” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, రాష్ట్ర ఐ‌టి శాఖ ముఖ్యకార్యదర్శి  జయేశ్‌రంజన్, హైదరాబాద్‌లోని అమెరికన్ కౌన్సిలెట్ అధికారులు పాల్గొన్నారు.

Related Post