హైదరాబాద్‌లో అమెజాన్ క్యాంపస్ ప్రారంభం

August 21, 2019
img

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ హైదరాబాద్‌లో తన కొత్త క్యాంపస్‌ను ఈరోజు ప్రారంభించింది. ఆ సంస్థకు ఇది ఆసియాలో కెల్లా అతిపెద్ద కార్యాలయం. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. 

రూ.400 కోట్లు పెట్టుబడితో నానక్‌రామ్‌గూడాలో 9.5 ఎకరాల విస్తీర్ణంలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ కార్యాలయంలో 15,000 మంది ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసుకునేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ అమెజాన్‌లో 7,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కొత్త కార్యాలయం అందుబాటులోకి రావడంతో వెంటనే మరో 3,000 మందిని నియమించుకోబోతోంది. అమెరికా వెలుపల అమెజాన్ సంస్థకున్న అతిపెద్ద కార్యాలయం ఇదే. దీనికి 2016, మార్చి 31న అప్పటి పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్‌ శంఖుస్థాపన చేశారు. కేవలం మూడున్నరేళ్ళ వ్యవధిలో ఇంత అతిపెద్ద కార్యాలయాన్ని అమెజాన్ నిర్మించింది. తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా సహాయసహకారాలు అందించడంవలననే తాము ఇంతవేగంగా ఇంత పెద్ద కార్యాలయాన్ని నిర్మించగలిగామని ఆ సంస్థ భారత్‌ డైరెక్టర్ అమిత్ అగర్వాల్ తెలిపారు.

Related Post