దూసుకుపోతున్న హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగం

August 16, 2019
img

రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆంధ్రాపాలకులు చెప్పేవారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తరువాతే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరం మరింతవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. 2008 నుంచి 2014 వరకు హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగం కేవలం రూ.1,800 కోట్లు మాత్రమే ఆకర్షించగా, 2015 నుంచి జూన్ 2019 వరకు రూ.10,100 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు జెఎల్ఎల్ ఇండియా అనే సంస్థ అధ్యయనంలో తేలింది. అంటే తెలంగాణ ఏర్పడిన 5 ఏళ్లలోనే పెట్టుబడులు ఐదున్నర రెట్లు పెరిగాయన్న మాట! 

ఐ‌టి, వాణిజ్యం, పరిశ్రమలను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆకర్షణీయమైన విధానాలే రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కారణమని జెఎల్ఎల్ నివేదికలో తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత నెలకొని ఉండటం, శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉండటం, విద్యుత్ కొరతను అధిగమించడం, రాజధానిలో కొత్తగా అనేక రోడ్లు, వంతెనలు, మెట్రో వంటి మౌలికవసతులు కల్పించడం వంటివి కూడా రియల్ ఎస్టేట్ అభివృద్ధికి దోహదపడ్డాయి. 

ఇంకా హైదరాబాద్‌లో పెట్టుబడులకు చాలా సానుకూలవాతావరణం ఏర్పడటం, విస్తృతమైన వ్యాపార అవకాశాలు, వివిద రంగాలలో నైపుణ్యం ఉన్న యువత అందుబాటులో ఉండటం, శంషాబాద్ వంటి అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయం కలిగి ఉండటం వంటివి అంతర్జాతీయ ఐ‌టి, వాణిజ్య సంస్థలను హైదరాబాద్‌కు రప్పించి రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేట్లు చేసాయి.  

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఇక ముందు కూడా ఇదే వేగంతో దూసుకుపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, కనుక త్వరలోనే 13.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కార్యాలయాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ దేశంలో అగ్రస్థానంలో నిలబడే అవకాశం ఉందని జెఎల్ఎల్ ఇండియా సంస్థ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ నాయర్ తెలిపారు.

Related Post