హైదరాబాద్‌ మెట్రో కొత్త రికార్డ్

August 16, 2019
img

హైదరాబాద్‌ మెట్రో సరికొత్త రికార్డు సృష్టించింది. బుదవారం ఒక్కరోజునే హైదరాబాద్‌ మెట్రోలో 3.06 లక్షల మంది ప్రయాణించారు. ఆదేరోజున హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి అత్యధికంగా 42,000 మంది ప్రయాణించారు. హైటెక్‌సిటీలో పనిచేసే ఐ‌టి ఉద్యోగులకు అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ మెట్రో చాలా సౌకర్యవంతంగా ఉండటంతో దానిలో ప్రయాణించడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. హైటెక్‌సిటీ వరకు మెట్రో సర్వీసులు అందుబాటులోకి రావడంతో నగరంలో ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న ఐ‌టి ఉద్యోగులు కూడా మెట్రో ద్వారానే ప్రయాణిస్తుండటంతో అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ కారిడార్ నిత్యం రద్దీగా ఉంటోంది.  

మెట్రో రైల్ ఎండీ ఎన్‌విఎస్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని మెట్రోరైల్ భవన్ వద్ద జాతీయజెండా ఎగురవేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “2017, నవంబర్ 29 నుంచి హైదరాబాద్‌ మెట్రో రైల్ సేవలు ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. బుదవారం ఒక్కరోజే 3.06 లక్షల మంది ప్రయాణించడం హైదరాబాద్‌ మెట్రో చరిత్రలో ఒక సరికొత్త రికార్డు. త్వరలోనే హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో సేవలు ప్రారంభించబోతున్నాము. ప్రస్తుతం అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ మద్య ప్రతీ 5 నిమిషాలకు ఒక రైల్ నడిపిస్తున్నాము. త్వరలో ప్రతీ 3 నిమిషాలకు ఒకటి చొప్పున నడిపించబోతున్నాము,”అని చెప్పారు. 

Related Post