ఆసియాలో ఫార్మా రంగానికి తెలంగాణ కేంద్రంగా మారబోతోంది

July 04, 2019
img

ఇప్పటికే దేశంలో ఫార్మా రంగానికి తెలంగాణ కేంద్రంగా నిలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఫార్మా సిటీ, మెడికల్ డివైసస్ పార్క్, వాటి తరువాత ఏర్పాటుచేయనున్న జీనోమ్ వ్యాలీ, రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ పార్క్ వాటి తరువాత బీ-హబ్ అన్నీ సిద్దం అయ్యి ఉత్పత్తి ప్రారంభిస్తే ఆ రంగాలలో తెలంగాణ రాష్ట్రం ఆసియా దేశాలలో ప్రధానకేంద్రంగా మారనుంది. 

ప్రస్తుతం రాష్ట్రంలో 800కు పైగా ఉన్న ఫార్మా కంపెనీలు ఏడాదికి 50 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణాలు పూర్తి చేసుకొని, ఉత్పత్తి ప్రారంభిస్తే ఏడాదికి 100 బిలియన్ డాలర్లకు పైగా వ్యాపారావకాశాలు పెరుగుతాయని హైదరాబాద్‌ ఫార్మా సిటీ లిమిటెడ్ సీఈఓ శక్తి నాగప్పన్ తెలిపారు. 


హైదరాబాద్‌ శివార్లలో ముచ్చెర్ల వద్ద 19,330 ఎకరాలలో ఏర్పాటవుతున్న హైదరాబాద్‌ ఫార్మా సిటీలో రూ.64,000 కోట్లు పెట్టుబడులు, సుమారు 1,70,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగం, ఉపాది అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నామని శక్తి నాగప్పన్ తెలిపారు. ఈ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు దేశవిదేశాల నుంచి పెద్దపెద్ద జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో ఫార్మా, మెడికల్, బయోలజీ రంగాలకు చెందిన పారిశ్రామికవాడలు, ఇప్పుడున్న కొన్ని జిల్లాల కంటే పెద్దవిగా అవే ఓ జిల్లాగా అవతరించే అవకాశం ఉంది.

Related Post