బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై నివేదిక

July 03, 2019
img

రాష్ట్ర విభజన సమయంలో ఖమ్మం జిల్లాలో బయ్యారం వద్ద ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని అప్పటి కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం దానిపై కమిటీ వేసి చేతులు దులుపుకొంది. కేంద్రప్రభుత్వం బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేయడానికి ఆసక్తి చూపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దానిని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దాని సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు మెకాన్ సంస్థకు బాధ్యత అప్పగించింది. 

ఆ సంస్థ ఇటీవల మధ్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. బయ్యారంలో లభ్యమయ్యే ముడి ఇనుము ఉక్కు తయారీకి తగినది కాదని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కనుక బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాదలిస్తే పొరుగునే ఉన్న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో దంతేవాడ జిల్లాలోని బైలదిల్లా గనుల నుంచి ముడి ఇనుమును రైల్వే వేగన్ల ద్వారా తీసుకురావలసి ఉంటుందని పేర్కొంది. దాని కోసం బైలడిల్లా నుంచి బయ్యారం సమీపంలో గల మణుగూరు వరకు రైల్వే లైన్ వేయవలసి ఉంటుందని మెకాన్ నివేదికలో పేర్కొంది. 

మెకాన్ సంస్థ ఇచ్చిన ఈ నివేదికపై రాష్ట్ర ఇందనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా అధ్వర్యంలో బుదవారం హైదరాబాద్‌లో సమావేశం జరుగనుంది. దానిలో రాష్ట్ర పరిశ్రమలు, గనుల శాఖల అధికారులు పాల్గొంటారు. 

బయ్యారంలో లభ్యమయ్యే ముడి ఇనుము నాణ్యమైనది కానందునే కేంద్రప్రభుత్వం అక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి వెనుకాడుతున్నప్పటికీ, అక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేయడం వలన వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాది కల్పించవచ్చుననే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం దానికి సిద్దపడుతోంది. 

విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ(వైజాగ్ స్టీల్)కి సమీపంలో ముడి ఇనుము, బొగ్గు గనులు లేకపోయినప్పటికీ పొరుగునే ఉన్న ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి ముడి ఇనుము, బొగ్గును తెచ్చుకొని దశాబ్ధాలుగా ఉక్కు ఉత్పత్తి చేస్తూ లాభాలబాటలో నడుస్తోంది. కనుక బయ్యారంలో కూడా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసినట్లయితే అది కూడా విశాఖ ఉక్కు కర్మాగారంలాగే దిగ్విజయంగా నడుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Related Post