హైదరాబాద్‌ మెట్రో సమాచార్

May 18, 2019
img

అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ కారిడార్‌లోని ‘జూబ్లీహిల్స్  చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌’ శనివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. హైటెక్‌సిటీ స్టేషన్ వద్ద మెట్రో రైళ్లను వెనక్కు తిప్పి తీసుకువచ్చేందుకు రివర్సల్ సదుపాయం లేకపోవడంతో నాగోలు నుంచి హైటెక్‌సిటీకి 9-10 నిమిషాలకు ఒక మెట్రో రైల్ చొప్పున నడిపించాలంటే ఆ సమయం సర్దుబాటు చేసేందుకు జూబ్లీహిల్స్ రోడ్ నంబరు:5, జూబ్లీహిల్స్  చెక్‌పోస్టు, మాదాపూర్ స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆపకూడదని నిర్ణయించారు. కానీ ఆ తరువాత క్రమంగా సమయం సర్దుబాటు చేస్తూ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు:5, మాదాపూర్ స్టేషన్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అదేవిధంగా నేటి నుంచి జూబ్లీహిల్స్  చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 

ఇది అందుబాటులోకి రావడంతో చుట్టుపక్కల గల ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, కేబీఆర్ పార్క్, గాయత్రి హిల్స్, తారకరామా నగర్ తదితర ప్రాంతాలలో నివసిస్తున వారికి చాలా సదుపాయంగా ఉంటుంది. జూబ్లీహిల్స్  చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ ప్రత్యేకత ఏమిటంటే ఒకే అంతస్తులో టికెట్ కౌంటర్లు, ప్లాట్ ఫారం ఉండటం. కనుక ప్రయాణికులకు ముఖ్యంగా మహిళలు, పెద్దవారికి ఇది చాలా సదుపాయంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోలో సగటున రోజుకు 2.50 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. జూబ్లీహిల్స్  చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ కూడా అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగవచ్చని మెట్రో అధికారులు భావిస్తున్నారు.

Related Post