రెక్కలు తెగిన జెట్ ఎయిర్ వేస్!

April 17, 2019
img

నష్టాలలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ సంస్థ బుదవారం రాత్రి నుంచి విమానసేవలు నిలిపివేయబోతోంది. ఒకప్పుడు 123 విమానాలతో సామాన్య పౌరులకు సైతం అందుబాటు ధరలలో విమానసేవలు అందుబాటులోకి తెచ్చిన జెట్ ఎయిర్ వేస్ నష్టాలలో కూరుకుపోవడంతో గ్రౌండ్ స్టాఫ్, పైలట్లు, విమాన సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేకపోయింది. దాంతో ఉద్యోగులు విధులు బహిష్కరించారు. కొందరు ఇతర సంస్థలలోకి తక్కువ జీతాలకు ఉద్యోగాలలో చేరిపోయారు. 

ప్రస్తుతం కేవలం 5 విమాన సర్వీసులను మాత్రమే జెట్ ఎయిర్ వేస్ నడిపిస్తోంది. కానీ బ్యాంకుల నుంచి రూ.400 కోట్లు అత్యవసర రుణం పొందడానికి అది చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో వాటిని కూడా నడిపించలేని దుస్థితికి చేరుకొంది. కనుక బుదవారం రాత్రి 10.30 గంటలకు నడిచే విమానమే తమ చివరి సర్వీసు కావచ్చునని జెట్ సంస్థ ప్రతినిధి చెప్పారు. ఒకవేళ బ్యాంకు నుంచి రుణం లభించకపోతే ఇప్పట్లో మళ్ళీ సేవలు అందించలేకపోవచ్చునని చెప్పారు. 

ఇంతకు ముందు విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కూడా ఇలాగే దివాళా తీస్తున్నప్పుడు అతనికి బ్యాంకులు చాలా ఉదారంగా రూ.9,000 కోట్లు రుణం అందజేశాయి. కానీ అతను బ్యాంకులకు నామం పెట్టి లండన్ పారిపోయాడు. ఆ భయంతోనే బ్యాంకులు ఇప్పుడు జెట్ ఎయిర్ వేస్ సంస్థకు అప్పు ఇవ్వడానికి భయపడుతున్నాయని చెప్పవచ్చు.

కానీ ఒక మంచి సంస్థ ఈవిధంగా నష్టాలపాలై మూతపడటం, దానిపై ఆధారపడి జీవిస్తున్న వందలాది ఉద్యోగులు వారి కుటుంబాలు రోడ్డున పడటం చాలా బాధాకరమే. జెట్ ఎయిర్ వేస్ సంస్థను కేంద్రప్రభుత్వం ఆదుకోగలిగితే బాగుండేది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశీయంగా విమానయాన రంగాన్ని అభివృద్ధి చేసి, కొత్తగా అనేక విమానాశ్రయాలు ఏర్పాటు చేసి, ఉడాన్ వంటి పధకాలతో సామాన్యపౌరులకు సైతం విమానసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. కానీ దేశంలో ఒకటొకటిగా విమాన సంస్థలు మూతపడుతుంటే మళ్ళీ పరిస్థితి మొదటికే రావచ్చు లేదా భారత్ లో విమానసేవలు నడిపించడం నష్టదాయకం అని ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉంది.

Related Post