బజాజ్ ప్రయోగం ఫలిస్తుందా?

April 17, 2019
img

దేశీయ వాహన రంగం పరిశ్రమలో భారతీయుల నమ్మకం చూరగొన్న సంస్థ బజాజ్. ఒకప్పుడు మధ్యతరగతి ప్రజల ఇళ్ళలో ఎక్కువగా కనిపించిన వాహనం బజాజ్ స్కూటర్. ఇప్పుడు వాటి స్థానంలో బజాజ్ బైకులు కనిపిస్తున్నాయి. అంటే దశాబ్ధాలుగా దేశంలో బజాజ్ వాహనాలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదని స్పష్టం అవుతోంది. టాటా సంస్థలాగే బజాజ్ కూడా మద్యతరగతి ప్రజల కోసం వారికి అందుబాటు ధరలో ఒక చిన్న కారును అందించాలని సంకల్పించి, ‘క్యూట్’ అనే పేరుతో ఒక చిన్న కారును రూపొందించింది. 

 వాటిని ఈ నెల 18న దేశవ్యాప్తంగా మార్కెట్లో విడుదల చేయబోతోంది. వీటిలో పెట్రోల్ మోడల్ క్యూట్ కారు (ఎక్స్‌ షో రూమ్) ధర రూ.2.64 లక్షలు, సీఎన్జీ మోడల్ ధర: 2.84 లక్షలుగా నిర్ణయించింది. 

బజాజ్ క్యూట్ వివరాలు: ఇంజన్ సామర్ధ్యం: 216సీసీ సింగిల్ సిలెండర్, ట్విన్ స్పార్క్ ఇంజిన్. 

వీటిలో పెట్రోలుతో నడిచే కారు 13 బీ.హెచ్.పీ, సీఎన్జీతో నడిచే కారు 10 బీ.హెచ్.పి. శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ తో నడిచే వాహనం లీటరుకు 36 కిమీ, సీఎన్జీతో నడిచేకారు 35కిమీ మైలేజి ఇస్తుందని బజాజ్ చెపుతోంది. 

ఇది భారత్‌లో తొలి క్వాడ్రి సైకిల్‌ వాహనంగా అనుమతి సంపాదించుకొంది. అంటే సుమారు ఆటోరిక్షాకు సమాన సామర్ధ్యం  కలిగిన వాహనమని చెప్పవచ్చు. ఇది కూడా నానో కారులాగే చాలా చిన్నదిగా రూపొందించడంతో పెద్దపెద్ద నగరాలు, పట్టణాలలో సులువుగా చిన్న చిన్న రోడ్లలో కూడా ప్రయాణించగలదు. పార్కింగ్ కోసం పెద్దగా స్థలం అవసరం లేదు. అలాగే మినీ టాక్సీలుగా కూడా వీటిని నడిపించుకోవచ్చు. నగరాలలో, పెద్ద పట్టణాలలో నివసించే మద్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని తయారుచేసిన వాహనం ఇది. ద్విచక్రవాహనాలపై  కుటుంబసమేతంగా వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నవారికి ఈ బజాజ్ క్యూట్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే టాటా ఉత్పత్తి ‘నానో’ కారును పెద్దగా పట్టించుకోని భారతీయులు ఇంచూమించు అటువంటిదే అయిన బజాజ్ క్యూట్ కారును ఆదరిస్తారో లేదో చూడాలి. 


Related Post