అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మెట్రోకు లైన్ క్లియర్

March 16, 2019
img

అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మెట్రో సర్వీసులు వారం రోజులలోపు ప్రారంభించబోతున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో మెట్రో రైళ్లు నడిపించడానికి కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్‌) అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎటువంటి ఆర్భాటం లేకుండా వచ్చే వారంలో ఈ కారిడార్‌లో మెట్రో సర్వీసులను ప్రారంభించబోతున్నామని ఎన్వీఎస్ రెడ్డి మీడియా ప్రతినిధులకు తెలిపారు. దీనికవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. 

పది కిమీ పొడవుగల అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ కారిడార్‌లో మధురానగర్, యూసఫ్ గూడా, జూబ్లీ హిల్స్ రోడ్ నెం:5, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్లు ఉంటాయి. దీంతో హైదరాబాద్‌లో మూడు కారిడర్లలో కలిపి మొత్తం 56కిమీ పొడవున మెట్రో సర్వీసులు నడుస్తాయి. 

హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేసేవారు అనేక ఏళ్లుగా ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్నారు. వారందరూ ఈ అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మెట్రో రైల్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ మార్గంలో మెట్రో  ప్రారంభం కానున్నందున వారందరికీ ఇకపై మెట్రోలో హాయిగా సౌకర్యవంతంగా తమ కార్యాలయాలకు చేరుకోవచ్చు. కనుక ఈ మార్గంలో హైదరాబాద్‌ మెట్రో సంస్థకు అత్యంత ఆదరణ, రాబడి లబించడం ఖాయం.

Related Post