మళ్ళీ కళకళలాడుతున్న సిర్పూర్ పేపర్ మిల్లు

February 25, 2019
img

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాపేరు వినగానే కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూరు పేపరు మిల్లు... దానిలో పనిచేసే వేలాదిమంది కార్మికులు కళ్ళముందు కదలాడుతారు. కానీ యాజమాన్యం తప్పుడు నిర్ణయాలు, వైఫల్యాల కారణంగా లాభాలలో నడుస్తున్న ఆ మిల్లు నష్టాల పాలై గత నాలుగేళ్ళుగా మూతపడింది.

అప్పటి నుంచి దానిలో పనిచేసే 4,000 మంది కార్మికులు రోడ్డున పడి అష్టకష్టాలు పడుతున్నారు. వారి కష్టాలను చూసిన తెరాస ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆ మిల్లును తిరిగి తెరిపించేందుకు పట్టుదలగా ప్రయత్నించారు. గత ప్రభుత్వంలో పరిశ్రమల శాఖమంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ ఆయన తపన చూసి మిల్లును తెరిపించేందుకు గట్టిగా కృషి చేశారు. ఆ మిల్లుపై ఉన్న నష్టాలను భర్తీ చేసి, అనేక రాయితీలను ఇవ్వడంతో జేకే పేపర్స్ సంస్థ ఆ మిల్లును నడిపించేందుకు ముందుకు వచ్చింది.

అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో గత ఏడాది ఆగస్టులో జేకే సంస్థ ఆ మిల్లును స్వాధీనం చేసుకొని అవసరమైన మరమత్తులు చేసి, మళ్ళీ కార్మికులను పనిలోకి తీసుకొని ఈ నెల 7వ తేదీ నుంచి ఉత్పత్తి ప్రారంభించడంతో మళ్ళీ కార్మికులతో కళకళలాడుతోంది. కర్రల నుంచి పేపర్ గుజ్జు (పల్ప్) తయారుచేసే చిప్పర్ హౌస్ ఇంకా సిద్దం కానందున వేరే కంపెనీ నుంచి పల్ప్ కొనుగోలుచేసి దానితో పేపర్ ఉత్పత్తి చేస్తున్నారు.

సిర్పూర్ పేపర్ మిల్సులో గత 15 రోజులుగా తయారైన కాగితపు బండిల్సను దేశవిదేశాలకు రవాణా చేసేందుకు మిల్లు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది నవంబరులోగా చిప్పర్ హౌస్ లోని యంత్రాల మరమత్తులు పూర్తవగానే అక్కడే పల్ప్ కూడా ఉత్పత్తి చేయబోతున్నట్లు మిల్లు అధికారులు తెలిపారు. కనుక 2019 డిసెంబరు నాటికి మిల్లులో పూర్తిస్థాయి ఉత్పత్తి జరుగనుంది.

 

Related Post