మొదటి ఏడాది నుంచే లాభాల బాటలో మెట్రో

February 12, 2019
img

హైదరాబాద్‌ మెట్రో సేవలను 2017, నవంబరు 29న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. మొదట మియాపూర్-అమీర్ పేట-నాగోల్ 30 కిమీల మార్గంలోనే ప్రారంభించినప్పటికీ ఆ తరువాత ఎల్బీనగర్‌-అమీర్ పేట మార్గంలో కూడా మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. త్వరలోనే అమీర్ పేట-హైటెక్ సిటీ మార్గంలో కూడా మెట్రో సేవలు ప్రారంభించదానికి మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

సాధారణంగా ఏ సంస్థకైన మొదటి సంవత్సరంలో చాలా ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి కనుక లాభాలు ఆర్జించడం కష్టమే కానీ హైదరాబాద్‌ మెట్రో సంస్థ మాత్రం సమస్యలను అధిగమించి రూ. 21.57 కోట్లు లాభాలు ఆర్జించింది. మొదటి సంవత్సరం (2017-18)లో హైదరాబాద్‌ మెట్రో సంస్థ ఆదాయం రూ. 62.63 కోట్లు కాగా దానిలో మెట్రో నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు వగైరాలకు రూ. 41.06 కోట్లు ఖర్చయింది. ఖర్చులు పోగా మెట్రోకు రూ.21.57 కోట్లు లాభం వచ్చింది. 

మెట్రో మొదటి సంవత్సరం ఆదాయంలో టికెట్ల అమ్మకాల ద్వారా రూ.28.60 కోట్లు, దుఖాణాలు, షాపింగ్ మాల్స్ ద్వారా రూ. 15.46 కోట్లు, ప్రకటనల ద్వారా రూ.16.32 కోట్లు, ఇతరత్రా రూ.2.25 కోట్లు కలిపి మొత్తం రూ. 62.63 కోట్లు ఆదాయం లభించిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్‌ తరువాత అత్యంత ముఖ్యమైన హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభం అయితే మెట్రో ఆదాయం గణనీయంగా పెరిగి లాభాలు ఆర్జిస్తుందని భావిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Post