నాంపల్లి ఎగ్జిబిషన్ అగ్నిప్రమాదంలో 250 షాపులు దగ్ధం

January 31, 2019
img

బుదవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్)లో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 250 దుఖాణాలు...వాటిలో విలువైన వస్తువులు మంటలలో కాలి బూడిదయ్యాయి. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన మహేష్ కోఆపరేటివే బ్యాంకు స్టాల్ లో నిన్న రాత్రి సుమారు 8 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరుగడంతో చిన్నగా మంటలు మొదలయ్యాయి. వెంటనే స్టాల్ నిర్వాహకులు, ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు సమీపంలోనే సిద్దంగా ఉన్న అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడకు చేరుకున్నప్పటికీ ఫైర్ ఇంజనులో నీళ్ళు లేకపోవడంతో మంటలను అదుపుచేయలేకపోయారు. వారు కూడా చూస్తుండగానే మెల్లగా మంటలు ఇరుగుపొరుగు దుఖాణాలకు వ్యాపించి 20 నిమిషాల వ్యవదిలో ఉవ్వెత్తున ఎగసిపడుతూ మరిన్ని దుఖాణాలకు వ్యాపించాయి. 

కళ్ల ముందే తమ దుఖాణాలు...వాటిలో లక్షలు విలువ చేస్తే వస్తువులు మంటలలో కాళి బూడిదైపోతుంటే  దుఖాణదారులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. మంటలు చుట్టుపక్కల దుఖాణాలకు వ్యాపించిన తరువాత 19 ఫైరింజన్లు అక్కడకు చేరుకొని సుమారు మూడున్నర గంటలసేపు శ్రమించి మంటలను అదుపు చేశాయి. దానినిబట్టి ప్రమాద తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ప్రాధమిక అంచనా ప్రకారం ఈ ప్రమాదంలో సుమారు రూ.150-200 కోట్లు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. 

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఎగ్జిబిషన్‌లో సుమారు 40,000 మంది వరకు సందర్శకులున్నారు. వారందరూ ఒకేసారి భయంతో బయటకు పరుగులు తీయడంతో కొంచెం త్రొక్కిసలాట జరిగింది. దానిలో కొంతమంది గాయపడినట్లు సమాచారం. వారినీ, అగ్నిప్రమాదంలో గాయపడిన కొంతమంది దుఖాణాయజమానులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

అగ్నిప్రమాదం జరిగినట్లు తెలియగానే ఎగ్జిబిషన్ నిర్వాహకులు చురుకుగా...తెలివిగా వ్యవహరించడం వలన భారీ ప్రాణనష్టం తప్పింది. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్ కు మూడువైపులా ఉన్న గేట్లను తెరిచి లోపల ఉన్నవారిని బయటకు పంపించివేస్తూ బయట నుంచి లోపలకి ఎవరినీ వెళ్ళకుండా నిలిపివేశారు. తద్వారా ప్రాణనష్టం జరుగకుండా అరికట్టగలిగారు. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో రైల్ సంస్థ కూడా చాలా తెలివిగా, ఉదారంగా వ్యవహరించడం విశేషం. ఎగ్జిబిషన్‌ నుంచి ఒకేసారి వేలాదిమంది బయటకు రావడంతో త్రొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పసిగట్టిన మెట్రో అధికారులు, మెట్రో రైళ్ళలో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించడంతో శరవేగంగా ఆ పరిసర ప్రాంతాల నుంచి జనాలను ఖాళీ చేయడంలో హైదరాబాద్‌ మెట్రో రైల్ సంస్థ తోడ్పడింది. 

ఈ ప్రమాదానికి కారణం స్టాల్లో ఏర్పాటుచేసిన ఒక విద్యుత్ వైరు నుంచి దాని సామర్ధ్యానికి మించి విద్యుత్ ను వాడుకునేందుకు ప్రయత్నించడమేనని తెలుస్తోంది. విద్యుత్ వైర్లు వేడెక్కి షార్ట్ సర్క్యూట్ అవడంతో చిన్నగా మంటలు మొదలయ్యాయి. అవి సమీపంలోనే ఉన్న మరో స్టాల్ లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లకు వ్యాపించడంతో అవి పేలిపోయి ఈ అగ్నిప్రమాదానికి దారి తీసినట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదం కారణంగా ఈరోజు ఎగ్జిబిషన్ (నుమాయిష్)కు శలవు ప్రకటించారు నిర్వాహకులు.


Related Post