తెరాస విజయంతో ఊపందుకున్న రియల్ ఎస్టేట్ బిజినెస్

January 18, 2019
img

తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ పరిస్థితి కాస్త అయోమయంగా కనిపించినా, తెరాస సర్కార్ చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలికవసతుల కల్పనలు, సంస్కరణల వలన ప్రజలలో...రియల్ ఎస్టేట్ వ్యాపారులలో మళ్ళీ నమ్మకం ఏర్పడటంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఊపందుకొంది. రాష్ట్రంలో మళ్ళీ తెరాసయే అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ మరింత జోరందుకొంది.

2014-15 ఆర్ధిక సంవత్సరంలో 7.5 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 2,750 కోట్లు ఆదాయం లభించగా, 2016-17 ఆర్ధిక సంవత్సరంలో అది రూ.5,200 కోట్లకు పెరిగింది. 2018-19లో డిసెంబర్ నాటికి 11 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4,800 కోట్లు ఆదాయం సమకూరింది. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి అంటే మార్చి నెలాఖరుకు మొత్తం రూ.6,100 కోట్లు ఆదాయం లభించవచ్చని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఐదేళ్ళలోనే 225 శాతం అభివృద్ధి చెందినట్లు స్పష్టం అవుతోంది. 

గత నాలుగున్నరేళ్ళలో ప్రభుత్వం అన్ని జిల్లాలలో సమాంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తునందున, అన్ని జిల్లాలలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముందుచూపుతో భారీగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసినవారికి ఇప్పుడు ఆ భూములలో బంగారు పంట పండుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కారణంగా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ వంటి కొన్ని జిల్లాలలో ప్రధాన పట్టణాల పరిసర ప్రాంతాలలో వ్యవసాయ భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొన్నధరకు సుమారు 100-300 శాతం వరకు లాభాలు కురిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్‌ నగరం చుట్టుపక్కల ప్రాంతాలలో కొందామన్నా భూములు లభించడం లేదని, కనుక నగరాన్ని ఆనుకొని ఉన్న చుట్టుపక్కల జిల్లాలకు తమ వ్యాపారాలను విస్తరిస్తున్నామని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెపుతున్నారు. ఆ కారణంగానే హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలలో కూడా భూముల ధరలు శరవేగంగా పెరిగిపోతున్నాయని వారే చెపుతున్నారు. 

ఇక హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో పలు ప్రధాన పట్టణాలలో రూ.1-2 కోట్లు ఖరీదు చేసే విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ళ కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరగడంతో వాటి నిర్మాణాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ పెరుగుదల కారణంగా ప్రభుత్వానికి ఆదాయం కూడా అదే నిష్పత్తిలో వేగంగా పెరుగుతోంది. ఈ పెరుగుదల వలన రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం పెరుగుతున్నప్పటికీ, భూముల ధరలు పెరిగిపోతుండటంతో అపార్టుమెంటులలో ఫ్లాట్స్ ధరలు కూడా పెరిగిపోతున్నందున మద్యతరగతి ప్రజలు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

Related Post