త్వరలో పొరుగు రాష్ట్రాలలో కూడా సింగరేణి మైనింగ్

January 12, 2019
img

రాష్ట్రంలో కాళేశ్వరం తదితర భారీ, మద్య తరహా సాగునీటి ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. అలాగే రాష్ట్రంలో జోరుగా పారిశ్రామికాభివృద్ధి కూడా జరుగుతోంది. కనుక రానున్న రోజులలో భారీగా విద్యుత్ అవసరంపడుతుంది. అధనపు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు భారీగా బొగ్గు అవసరం పడుతుంది. 

కనుక సింగరేణి సంస్థ పెరుగబోయే ఆ డిమాండును తట్టుకోవడానికి ఇప్పటి నుంచే అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 48 అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనులతో బాటు సింగరేణి సంస్థ ఒడిశాలోని నైనీ బ్లాకులో కూడా చాలా కాలంగా బొగ్గు త్రవ్వకాలు సాగిస్తోంది. ఆవికాక రాష్ట్రంలో కొత్తగా మరో మూడు అండర్ గ్రౌండ్, మూడు ఓపెన్ కాస్ట్ గనులను ప్రారంభించడానికి సింగరేణి సంస్థ జోరుగా సన్నాహాలు చేస్తోంది. 

భవిష్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాలలో కొత్తగా 6 బ్లాకులలో మైనింగ్ చేయడానికి సింగరేణి యాజమాన్యం ఆ రాష్ట్రాల అధికారులతో చర్చిస్తోంది. ఒడిశా ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ‘న్యూ పాత్రపురా’ బ్లాకును ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. కేంద్రప్రభుత్వం, మూడు రాష్ట్రాల మద్య వీటికోసం జరుగుతున్న చర్చల ప్రక్రియ పూర్తయితే సింగరేణి సంస్థ మైనింగ్ కార్యక్రమాలు పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరిస్తాయి. 

ఇక ఖమ్మం జిల్లాలోని బయ్యారం వద్ద ఉక్కు కర్మాగారం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. కానీ కేంద్రప్రభుత్వం సముఖంగా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దానిని నిర్మించడానికి సిద్దం అవుతోంది. దాని సాధ్యాసాధ్యాలు, లాభనష్టాలపై అధ్యయనం చేసేందుకు ఇదివరకే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదిక అందితే ఉక్కు కర్మాగారం నిర్మాణం ప్రారంభం అవుతుంది. డానికి బయ్యారం గనులలో నుంచి ముడి ఇనుమును వెలికి తీసి అందించే బాధ్యతను సింగరేణికే అప్పగించాలని సిఎం కేసీఆర్‌ ఇదివరకే నిర్ణయించారు. కనుక బయ్యారం ఉక్కు కర్మాగారం ప్రతిపాదనకు కూడా ఆమోదం లభిస్తే సింగరేణి కార్యకలాపాలు మరింత విస్తరిస్తాయి. ఆ మేరకు కొత్త ఉద్యోగాలు కూడా ఏర్పడతాయి. కనుక రానున్న ఐదేళ్ళలో సింగరేణి అనూహ్యంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Post