నేటి నుంచే ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మెట్రో సర్వీసులు

September 24, 2018
img

హైదరాబాద్‌వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మెట్రో సర్వీసులు సోమవారం నుంచి మొదలుకాబోతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్ నరసింహన్‌ అమీర్ పేట మెట్రో స్టేషన్లో పచ్చ జెండా ఊపి మెట్రో సర్వీసులను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి మెట్రో సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. 16 కిమీ పొడవుండే  మార్గంలో ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ స్టేషన్లతో కలిపి మొత్తం 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. అమీర్‌పేట, పంజగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్దీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీ భవన్, ఓ.ఏం.సి., ఎంజి బస్టాండ్, మలక్ పేట, మూసారం బాగ్, న్యూ మార్కెట్, దిల్ షుక్ నగర్, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్,  ఎల్‌బీనగర్‌ వద్ద మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గంలో తొలుత ప్రతీ 5 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో రైళ్లు నడుస్తాయి. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి అవసరమైతే కొన్ని రోజుల తరువాత ప్రతీ 2 నిమిషాలకు ఒక రైలు నడిపించాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. 

నగరంలో ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది కనుక రోడ్డు మార్గంలో గమ్యం చేరుకోవాలంటే కనీసం గంటకు పైగా సమయం పడుతుంది. కానీ మెట్రోలో కేవలం 20 నిమిషాలలోపే చేరుకోవచ్చు. అలాగే మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ చేరుకోవడానికి మెట్రోలో కేవలం 52 నిమిషాలు సమయం మాత్రమే పడుతుంది. ఏపీకి వెళ్ళే బస్సులన్నీ ఎల్బీనగర్‌ నుంచే బయలుదేరుతుంటాయి. కనుక మియాపూర్, అమీర్‌పేట్‌ తదితర ప్రాంతాలలో నివసిస్తున్నవారు మెట్రోలో చాలా సులువుగా ఎల్బీ నగర్ చేరుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మియాపూర్-ఎల్‌బీనగర్‌ మార్గంలో ఉన్న ప్రాంతాలలో ఎక్కడికి వెళ్లాలన్న అమీర్‌పేటలో రైలు మారనవసరం లేదు.

Related Post